సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (15:22 IST)

రాజధాని భూముల బాగోతం ఓ సంచలనాత్మక స్కామ్: వైఎస్. జగన్

రాజధాని భూముల బాగోతం ఓ సంచలనాత్మక కుంభకోణంగా బయటకు రాబోతుందని వైకాపా అధినేత, నవ్యాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ఆదివారం ఢిల్లీకి వెళ్లిన జగన్.. ప్రధాని మోడీతో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షాతో సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత ఆయన ఏపీ భవన్‌కు చేరుకుని అధికారులను కలుసుకున్నారు. పిమ్మట అక్కడే విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినట్టు చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆర్థిక సాయం అవసరముందని ప్రధానిని అభ్యర్థించినట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌పై బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97 వేల కోట్లు అప్పులు ఉంటే.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రూ.2.57 లక్షల కోట్లకు చేరాయన్నారు. అలాగే అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయన్నారు. వీటి పరిష్కారానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరినట్టు చెప్పారు. 
 
ఇకపోతే, మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా మద్యపానం దశలవారీగా అమలు చేస్తామన్నారు. ఒకేసారి మద్యనిషేధాన్ని అమలు చేస్తే రాష్ట్రం భారీగా ఆదాయాన్ని కోల్పోతుందారు. అయితే, 2024 నాటికి కేవలం ఐదు నక్షత్ర హోటళ్ళకే పరిమితమయ్యేలా రాష్ట్రంలో మద్యపానం అమలు చేస్తామని వెల్లడించారు. ఇకపోతే, తమ పార్టీ తరపున తాము ప్రకటించిన నవరత్నాల మేనిఫెస్టోను ఓ బైబిల్‌గా, ఓ ఖురాన్‌గా, ఓ భగవద్గీతలా భావించి, వాటిలోని అంశాలను తు.చ తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. 
 
ఎన్నికల్లో ప్రజలు తమ విశ్వసనీయతకు పట్టంకట్టారని, విశ్వసనీయత సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తామని చెప్పారు. కేంద్రంపై ఇంతగా ఆధారపడాల్సిన పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. రాష్ట్రాన్ని బాగా నడపాలనే తపన నాకు ఉందనీ, కానీ వనరులు మాత్రం అతి తక్కువ ఉండటం వల్ల ఆర్థిక కష్టాలు తప్పవన్నారు. 
 
అదేవిధంగా రాజధాని కోసం భూముల సేకరణ ఓ స్కామ్ అని చెప్పారు. రాజధాని భూముల బాగోతం ఓ సంచలనాత్మక కుంభకోణంగా వెలుగులోకి రానుందని జగన్ చెప్పారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగా లీక్ చేసి.. చంద్రబాబు, ఆయన బినామీలు, అనుచరులు భారీగా భూములు కొనుగోలు చేశారన్నారు. కానీ, రైతుల నుంచి మాత్రం ల్యాండ్ పూలింగ్ పేరుతో బలవంతంగా లాక్కొన్నారని జగన్ ఆరోపించారు. అలాగే, ఆయా శాఖల్లో జరిగిన అక్రమాలను వెలుకితీసి ప్రక్షాళన చేయనున్నట్టు జగన్ తెలిపారు.