మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (10:43 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి నెల సేవా టిక్కెట్ల విడుదల ఎపుడంటే...

venkateswara swamy
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. జనవరి నెల సేవా టిక్కెట్లను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలిపింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 జనవరి నెల కోటాను ఈ నెల 19న (ఎల్లుండి) ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్‌లైనులో విడుదల చేయనున్నట్టు తితిదే వెల్లడించింది. 
 
అక్టోబరు 21వ తేదీ ఉదయం పది గంటల వరకూ ఆన్‌లైనులో నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో ఈ టికెట్లను కేటాయిస్తారు. టికెట్లు పొందినవారు అక్టోబరు 21 నుంచి 23వ తేదీ ఉదయం 10 గంటల లోగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఇక కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను అక్టోబరు 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి జనవరి నెల కోటాను కూడా టీటీడీ విడుదల చేయనుంది.
 
అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి ఆన్లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీన ఉదయం 11 గంటలకు తితిదే అందుబాటులోకి తీసుకొస్తుంది. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెలలో ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైనులో టీటీడీ విడుదల చేయనుంది.