రాపులపాలెంలో ఫైనాన్స్ వ్యాపారిపై అర్థరాత్రి కాల్పులు
కోనసీమ జిల్లా రావులపాలంలో అర్థరాత్రి కలకలం చెలరేగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. వారిని వ్యాపారి కుమారుడు ప్రతిఘటించాడు. అయినప్పటికీ వారు కాల్పులు జరపడంతో బాధితులు పెద్దగా కేకలు వేశారు. దీంతో దండుగులు అక్కడ నుంచి పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
రావులపాలెంలో సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి బడా ఫైనాన్స్ వ్యాపారిగా చెలామణి అవుతున్నాడు. ఈయనపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్థరాత్రి కాల్పులకు తెగబడ్డారు. తొలుత ఆయనపై దుండగులు కాల్పులు జరుపగా, ఆ తర్వాత సత్యనారాయణ రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి వారిని ప్రతిఘటించడంతో నిందితులు గాల్లోకి కాల్పులు జరిపారు.
దీంతో సత్యనారాయణ, ఆయన కుమారుడు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో ఓ దండుగుడి చేతి సంచి కిందపడిపోయింది. దీన్ని పరిశీలించగా, అందులో రెండు నాటు బాంబులు, జామర్‌లు ఉన్నాయి. ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాయి.