బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (12:41 IST)

నారా భువనేశ్వరి పిలుపుతో దాతల నుంచి అనూహ్య స్పందన

కరోనా బాధితుల సేవా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్న ఎన్ టిఆర్ ట్రస్ట్...తెలంగాణాలో మరో రెండు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.

కరోనా రోగుల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర వహించే ఆక్సిజన్ సరఫరాపై ఎన్ టిఆర్ ట్రస్ట్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై పెద్దఎత్తున స్పందిస్తున్న దాతలకు ఆమె అభినందనలు తెలిపారు. రెండు తెలుగురాష్ట్రాలనుంచి ఇప్పటివరకు 25లక్షల రూపాయల మేర విరాళాలు అందాయి.

ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల కోసం న్యూజిలాండ్ తెలుగుదేశం పార్టీ అభిమానులు 5లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. కృష్ణాజిల్లాకు చెందిన గుత్తికొండ వీరభద్రరావు 1,11,116రూపాయలను విరాళంగా అందించారు. కరోనా మృతిచెందిన వారి చివరిమజిలీ గౌరవప్రదంగా ఉండాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ముందుకురాని మృతదేహాలు, అనాధ శవాలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి సాంప్రదాయాలకు అనుగుణంగా  అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

ట్రస్ట్ ఆధ్వర్యాన టెలీమెడిసిన్ సేవలు, ఉచిత మందులు, ఆహార పంపిణీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 690మందికి టెలీమెడిసిన్ అందించగా, 326మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఏర్పాటుచేసిన 24/7 కాల్ సెంటర్ ద్వారా నిరంతరం సేవలు అందుతున్నాయి.

ఎన్ టిఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రత్యేక శద్ధ తీసుకుంటూ కరోనా బాధితులకు అందించే సేవలు, సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బాధితులకు ఎప్పుడు ఎటువంటి సహాయం అవసరమైనా సేవలందించే ఎన్టీఆర్ ట్రస్ట్ సేవావిభాగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది.

పేదల జీవితాల్లో వెలుగునింపేందుకు కృషిచేస్తూ వారి సామాజిక, ఆర్థికాభివృద్ధి ద్వారా సాధికారిత సాధనే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలందిస్తోంది.