బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (10:03 IST)

విశాఖ జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కు స్పందన కరవు

విశాఖ జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో గత నెల 16వ తేదీన వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. ఈ నెల రోజుల్లో ముందుగా స్లాట్లు తీసుకున్న వారిలో 37,684 మంది (40.30 శాతం) మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

మరో 55,667 మంది వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకురాలేదు. అత్యధికంగా 21,597 మంది ఆరోగ్య సిబ్బంది (60.77 శాతం) వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 39.23 శాతం మంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నారు. వీరిలో మూడొంతుల మంది ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లకు చెందినవారిగా అధికారులు చెబుతున్నారు.

మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి పూర్తయిన తరువాత ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. ప్రస్తుతం మిగిలిన ఆరోగ్య సిబ్బందితోపాటు రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌, కేంద్ర బలగాలకు వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.

అయితే ఈ శాఖలకు చెందిన సిబ్బంది నుంచి నామమాత్రంగానే స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా మునిసిపల్‌ శాఖలో అత్యల్పంగా 11.64 శాతం మంది మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ శాఖకు చెందిన 24,263 మంది సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు స్లాట్‌ బుక్‌ చేయగా, 2,826 మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు.