శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (12:12 IST)

జగన్ సతీమణి భారతిపై సీబీఐ కూడా కేసు నమోదు చేయాలి: వర్ల రామయ్య

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జగన్ సతీమణి భారతిని ఈడీ నిందితురాలిగా చేర్చింది. భారతి సిమెంట్స్ విషయంలో జరిగిన క్విడ్ ప్రొకో కేసులో జగన్‌తో పాటు భారతిని కూడా ముద

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జగన్ సతీమణి భారతిని ఈడీ నిందితురాలిగా చేర్చింది. భారతి సిమెంట్స్ విషయంలో జరిగిన క్విడ్ ప్రొకో కేసులో జగన్‌తో పాటు భారతిని కూడా ముద్దాయిగా పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జీషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఆమె పేరును తొలిసారి ఛార్జీషీటులోకి చేర్చారు. 
 
ఈడీ చార్జీషీటును కోర్టు విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లపై విచారణ కోసం జగన్ ఇప్పటికే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భారతిపై దాఖలు చేసిన చార్జిషీటును కూడా కోర్టు స్వీకరిస్తే ఆమె కూడా వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. భారతి సిమెంట్స్‌ మనీలాండరింగ్‌పై ఈడీ దాఖలు చేసిన తాజా ఫిర్యాదును కూడా కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీచేస్తే జగన్‌, భారతి ఇద్దరూ వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంటుంది. 
 
మరోవైపు జగన్‌ కంపెనీల్లోకి అక్రమ పెట్టుబడులకు సంబంధించిన మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. సీబీఐ సమర్పించిన 11 చార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే మరిన్ని అభియోగపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు.
 
ఇదిలా ఉంటే... వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఇప్పటికైనా మేల్కొని భారతిపై కేసు నమోదు చేయాలని ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులను సంపాదించడానికి జగన్‌కు ఆయుధంగా బ్రదర్ అనిల్ ఉపయోగపడ్డారని వర్ల గుర్తు చేశారు.
 
భారతిపై ఈడీ కాకుండా సీబీఐ కూడా కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. జగన్ 84 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారంటే ఏ మేర సంపాదించారో జనం అర్థం చేసుకుంటారన్నారు. వివిధ కేసుల్లో భారతి పాత్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌కు కన్పించినప్పుడు సీబీఐకి ఎందుకు కన్పించడం లేదని వర్ల ప్రశ్నించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అనిల్ శాస్త్రి వైఎస్ అల్లుడయ్యాక బ్రదర్ అనిల్‌గా మారి కోట్లకు ఎలా పడగలెత్తారని వర్ల నిలదీశారు.
 
తండ్రి సీఎంగా ఉండగా సీఎంవోలో కూర్చొని ఒకేరోజు 389 జీవోలు అనుకూలంగా తెప్పించుకున్న జగన్‌ నీతులు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా అండ చూసుకొని తనకు ఏమీ కాదులే అనుకుంటున్న జగన్‌ను జైలుకు వెళ్లకుండా దేవుడు కూడా రక్షించలేడన్నారు.
 
అద్దె ఇంట్లో మొదటి భార్య, పిల్లలతో ఉన్న అనిల్‌ శాస్త్రి వైఎస్‌ అల్లుడయ్యాక, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌గా మారారని, ఆ తర్వాత 11 కంపెనీల్లో డైరెక్టర్‌ అయ్యాడని ఆయన ఆరోపించారు. సుమోటోగా తీసుకుని 11 చార్జిషీట్లలో భారతి, అనిల్‌ను కూడా చేర్చాలని రామయ్య సీబీఐ కోర్టును కోరారు. జగన్‌ విశ్వసనీయత గురించి 77 ప్రశ్నలు సంధించిన రామయ్య వాటిలో మొదటి ఎనిమిదింటికీ సమాధానం చెప్తే చెవి కోసుకుంటానని సవాల్‌ విసిరారు.