శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (15:44 IST)

స్వర్ణ భారతి ట్రస్ట్ వారి తెలుగు పద్య వైభవం-గౌరవ ఉపరాష్ట్రపతి ప్రసంగం

• అమ్మ పాలతో నేర్పిన భాష....
నాన్న వేలితో చూపిన బాట....
తరతరాలకు వెలుగులు పంచేది... మన మాతృభాష.
 
• అందుకే మాతృభాష ప్రాధాన్యత గురించి నేనెప్పుడూ చెబుతూ ఉంటాను. ఎందుకంటే మన భావాలను సరైన మార్గంలో తెలియజేయడానికి మాతృభాషకు మించిన వారధి లేదు. మరీ ముఖ్యంగా మన తెలుగు భాషలోని మాధుర్యం మాటల్లో చెప్పలేనిది.
 
• జన్మభూమి, కన్నతల్లి, మాతృభూమి, మాతృభాషే మన అస్తిత్వం. ఘనమైన తెలుగుదనాన్ని రాబోవు తరాలకు గొప్ప ఘనచరిత్రగా మనం అందించాలంటే మన భాషను కాపాడుకోవాలి. మన సాహిత్యాన్ని చదవాలి. అందులోని గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటాలి.
 
• భాష తెలియడం అంటే నిఘంటువులోని పదాలు, వ్యాకరణ సూత్రాలు తెలియడమే కాదు. వాక్య విన్యాస రహస్యాలు తెలియాలి. నుడికారంలోని సొబగులు తెలియాలి. పలుకులోని కాకువు (స్వరం) తెలియాలి. 
 
• ఇవి తెలియాలంటే పండితుడైతే సరిపోదు పలుకుబడులను పట్టుకోవాలి. తరతరాలుగా పారుతున్న భాషా ఝరిలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి. దీని కోసం తెలుగు వారి ముందున్న మార్గాల్లో తెలుగు పద్యం ఉన్నతమైనది.
 
• ప్రపంచంలో ప్రతి సంస్కృతిలోనూ ప్రత్యేకమైన పండుగలు, సంప్రదాయాలు ఎలాగైతే ఉంటాయో, సరిగ్గా భాషకు కూడా అలాంటి ప్రత్యేకతలే ఉంటాయి. వాటి ద్వారా ఆయా భాషల్లోని మాధుర్యం మరింత పెరుగుతుంది. కమ్మని ఆవుపాల వంటి తెలుగు భాషకు తెలుగు పద్యమే మకరంద మాధుర్యాన్ని అందించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
 
• తెలుగు పద్యం అంత మనోజ్ఞమైనదీ, మధురమైనదీ, సుందరమైనదీ మరే భాషలో లేదనడం  అతిశయోక్తి  కాదు. తెలుగు పద్యం తరతరాలుగా ఎవరూ వీలునామా రాయనవసరం లేకుండానే మనకు సంక్రమించిన పెద్దల ఆస్తి. తెలుగు భాషకే ప్రత్యేకతను, ఔన్నత్యాన్ని తెచ్చిన అద్భుతమైన ప్రక్రియ తెలుగు పద్యం. 
 
• దాదాపు 2వేల సంవత్సరాలుగా నన్నయ్య నుంచి ఎందరో కవులు తెలుగు పద్యాన్ని అందంగా రమ్యమైన ఉపమానాలతో, అలంకారాలతో తీర్చిదిద్ది మనకు అందించారు. తెలుగు భాష గొప్పతనం తెలుసుకోవాలంటే తెలుగు పద్యం గురించి తెలుసుకుని తీరాలి. తెలుగు సంస్కృతికీ, తెలుగు జీవితానికీ, తెలుగు పద్యానికీ విడతీయలేని బంధం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు తనానికి ప్రతీక తెలుగు పద్యం.
 
• మన నిత్యజీవితంలో, మన శ్రమలో, మన కష్టంలో, మన బాల్యపు లాలిత్యంలో, మన ప్రేమలో, మన అనుబంధాల్లో ఉన్న లయ తెలుగు పద్యంలో ఉన్నది. ఒకప్పుడు వేమన, సుమతీ శతకాల పద్యాలతోనే మన తెలుగు వారి విద్యాబోధన ప్రారంభమయ్యేది.
 
• ‘చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ..’  అని మన చిన్నారి ముద్దుముద్దుగా పలికినా..... ‘అమ్మా, మన్ను తినంగ నే శిశువునో..’  అని శ్రీకృష్ణుడు తల్లి యశోదతో అన్నా.... ‘ఇందుగలడు అందులేడని.’. అని ప్రహ్లాదుడు హిరణ్య కశిపుడితో చెప్పినా.... అది పద్యంలో ఇమిడిపోయింది.  ‘సుకవి జీవించు ప్రజల నాలుకల యందు..’  అని గుర్రం జాషువా అన్న మాట ఆటవెలదిగా మారింది.  
 
• అసలు పద్యం నేర్చుకోవడం వల్ల ఒరిగేదేంటి అనే ప్రశ్న కూడా మన మనసుల్లో ఉదయించక మానదు. ఎప్పుడో అచ్చు యంత్రాలు లేనప్పుడు తప్పక వచ్చిన వాజ్ఞ్మయ సంప్రదాయం ఇప్పుడెందుకు అనే వారూ లేకపోలేదు. పద్యాలను కంఠస్తం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. భాషా పరిజ్ఞానం విస్తరిస్తుంది.
 
• పల్లెల్లో అక్షర జ్ఞానం లేని వారు సైతం కేవలం కంఠోపాఠం ద్వారా పద్యాలను పాడే అలవాటు ఈనాటికీ ఉంది. చిన్ని, చిన్ని పదాలతో గుప్త భావనలు, వ్యక్తీకరణలతో అంతకుమించి అల్పాక్షరాల్లో అనంతార్థాన్ని ఇమడ్చగల సత్తా ఒక్క పద్యానికే ఉంది. ఇది తెలుగు వారికే ప్రత్యేకమైన సాహిత్యంగా మనం సగర్వంగా చెప్పుకోవచ్చు.
 
• అన్నిటి కంటే ముఖ్యంగా మనసును కట్టిపడేసి తన వైపు తిప్పుకోగల శక్తి, ధారణను పెంచగలిగే శక్తి పద్యానికి ఉంది. అందుకే ఆ నాడు సాహిత్య రచన మొదలుకుని వైజ్ఞానికి, గణిత రచనలను సైతం పద్యంగానే మన పూర్వీకులు అందించారు.
 
• తెలుగు భాష మాధుర్యం మన పద్యాల్లోనూ, మన సంగీతంలోనూ వ్యక్తమవుతుంది. పద్య కవిత మన తెలుగు ప్రజల సంపద.  పద్యం ఎంత ప్రాచీనమైనదో,  అంత ఆధునికమైనది. తల్లి భాషలో మనదైన హృదయం ఎలా ఉంటుందో తెలుగు పద్యంలోనే సాహిత్యం ఔన్నత్యం ఉంటుంది. 
 
• మనిషి జీవితంలోని భావోద్వేగాలను, అనుభూతులను తెలుగు పద్యంలో అద్భుతంగా వ్యక్తీకరించవచ్చునని మన కవులు పలు సందర్భాల్లో నిరూపించారు. బమ్మెర పోతన నుంచీ గుర్రం జాషువా, జంధ్యాల పాపయ్య శాస్త్రి వరకూ తెలుగు పద్యంలో మనం మాట్లాడే సరళమైన భాషను విలీనం చేశారు. 
 
• రాయప్రోలు సుబ్బారావు, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి, దాశరథి, పుట్టపర్తి తెలుగు పద్యాన్ని జీవింపజేశారు. పద్యం శక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియజేశారు. తిరుపతి వేంకటేశ్వర కవులు తెలుగు పద్యాన్ని నాటకరంగం ద్వారా ప్రజలకు సాన్నిహిత్యం చేశారు. వారు రాసిన పాండవోద్యోగ విజయం పద్యాలు జనం నాలుకలపై ఇప్పటికీ ఆడుతుంటాయి.
 
• పద్యం ద్వారా ఆధునిక భావాలను కూడా చెప్పగలమని ఎందరో  అవధాన కవులు రుజువు చేశారు. తెలుగు సాహిత్యానికే ప్రత్యేకమైన అవధాన ప్రక్రియ ద్వారా పద్యం సజీవంగా కొనసాగుతోంది. నేటికీ మేడసాని మోహన్, నాగఫణి శర్మ, గరికపాటి నరసింహారావు లాంటి వారు  పద్య కవితల్ని తమ నాలుకలపై నర్తింపచేస్తున్నారు.
 
• ‘నవయుగాల బాట నార్ల మాట’ అని రాసిన నార్లవేంకటేశ్వరరావు, ‘అంతము లేని ఈ భువనమంత పురాతన పాంథశాల’ అని రాసిన దువ్వూరి రామిరెడ్డి, సిరిసిరిమువ్వ పద్యాలు రాసిన శ్రీశ్రీ మొదలైన వారెందరో ఆధునిక భాషను పద్యాల్లో ఇమడ్చగలమని, కాలపు అవసరాలకు తగినట్లు మారే శక్తి పద్యానికి ఉందని నిరూపించారు.  
 
 
• నేటి కాలంలో పద్యంపై చిన్నచూపు ఏర్పడింది. ఇందుకు ప్రధాన కారణం నేటి తరానికి ఆంగ్ల మాధ్యమంపై మోజు పెరగడమే. తల్లిదండ్రులు కూడా ఆంగ్లభాషపై  మోజు పెంచుకోవడంతో తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గిపోతోంది. ఇది తెలుగు పద్యానికి కూడా శాపంగా పరిణమించింది. 
 
• ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో 13వ స్థానంలో, దేశంలో జాతీయ భాష హిందీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న తెలుగు భాష అత్యంత ప్రాచీన భాషగా గుర్తింపు పొందినప్పటికీ ఆ భాష ప్రత్యేకతను మనమే గుర్తించలేని దుస్థితిలో ఉన్నాం. 
 
• 56 అక్షరాలున్న తెలుగు భాష భావవ్యక్తీకరణలో అత్యంత అనువైనదని ప్రపంచమంతా గుర్తించినప్పటికీ మనమే గుర్తించలేకపోవడం దురదృష్టకరం. తల్లి పాల వంటి తెలుగు భాషను మరచి, పోతపాల వంటి పరభాషకు అంకితమవుతున్నాం. ఈ పరిస్థితి మారాలి. ప్రజలు, ప్రభుత్వాలు మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి.
 
• నేను చాలాసందర్భంలో చెప్పాను. మాతృభాష కళ్లలాంటిది, పరభాష కళ్ల జోడు లాంటిదని. కళ్ల జోళ్లు ఎన్నైనా మార్చవచ్చు కాని కళ్లను మార్చలేం కదా. నిజమైన భావ వ్యక్తీకరణ, ప్రగతి, మాతృభాష వల్లనే వస్తుందని, స్వభాషలో విద్య ఉండాలని గాంధీజీ పేర్కొన్నారు. మాతృభాషలో విద్యాబోధన వల్ల మనసులు చురుకుగా పనిచేస్తాయని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు.
 
• ఇటీవలి పరిశోధనలు కూడా మాతృభాషలో విద్యాబోధన వల్ల గ్రహణ సామర్థ్యం పెరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. అందుకే తల్లిపాలవంటి మాతృభాషను ప్రేమిస్తూ.. పోతపాల వంటి పరభాషపై వ్యామోహం తగ్గించుకోవడం మంచిది. బుద్ధిజీవులను పెంచేది విద్యయితే.. దానికి తోడ్పడేదే భాష అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
 
• మాతృభాష పట్ల ప్రేమను పెంచుకోవడం అంటే, ఇతర భాషలను నేర్చుకోవద్దని కాదు. మీరు కోరినన్ని భాషలు నేర్చుకోండి. ఈ విషంలో ఆకాశమే హద్దు. కానీ మాతృభాషను మాత్రం మీ రక్తంలో నింపుకోండి. మీ నాల్కల మీదే కాదు, మీ హృదయంలోనూ మాతృభాషకు చోటు ఇవ్వండి.
 
• తెలుగు పద్యాన్ని తమ అమర గానం ద్వారా జీవింప చేసిన గాయకుల్లో శ్రీ ఘంటశాల వెంకటేశ్వరరావు ప్రథమ స్థానంలో నిలుస్తారు. కరుణశ్రీ రచించిన పుష్ప విలాపం, కుంతి కుమారి లోని  పద్యాలను  ఆలపించడం ద్వారా ఆయన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిని ప్రజల నాలుకలపై నిలిచేలా చేశారు. అనేక పౌరాణిక చిత్రాల్లో వారు ఆలపించిన పద్యాలను నేటికీ ఆస్వాదిస్తూనే ఉన్నాం.
 
• ఆ ఘంటశాల పాడిన పాటల స్వరకల్పనను, రాగమాధుర్యాన్ని పరిశోధించిన డాక్టర్ శరత్ చంద్ర తెలుగు పద్యాన్ని తద్వారా తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించడానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయం. తెలుగు భాషను కాపాడేందుకు వరం, ఘంటసాల స్వరం అని మనసా వాచా కర్మణా నమ్మిన ఘంటసాల ఆరాధకుడు డాక్టర్ శరత్  చంద్ర. 
 
• ఘంటసాల స్వర పరిశోధకుడుగా, ఘంటసాల సంగీత కళాశాల స్థాపకుడుగా, ఘంటసాల స్వరామృత ధార పేరుతో యూట్యూబ్ ఛానెల్ నెలకొల్పిన వ్యక్తిగా  డాక్టర్ శరత్ చంద్ర ఘంటసాల ను భావి తరాలకోసం పరిరక్షిస్తున్న తీరు అభినందనీయం.
 
• భాష ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. సంగీతం, సాహిత్యం, కళలు, వినోదం, పద్యం, గద్యం, మాటలు, పాటలు అన్నీ భాషతోనే ముడిపడి ఉంటాయి. ఇవన్నీ కలిసిన తెలుగులోనే మన వెలుగు ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని, తెలుగు పద్యాన్ని చెవులతో గాక మనసుతో ఆస్వాదించాలని ఆకాంక్షిస్తున్నాను.