శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మాకు రాజధాని అక్కర్లేదంటూ బంగారు గాజులు విరాళమిచ్చిన మహిళ

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుతూ గత 64 రోజులుగా ఉద్యమంసాగుతోంది. ఈ ఉద్యమంలో మహిళలే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన 29 మండలాలకు చెందిన రైతులు ఈ ఉద్యమానికి ఊపిరిగా ఉన్నారు. 
 
మరోవైపు, ఈ ఉద్యమానికి అన్ని ప్రాంతాల వారు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎంవీ ప్రసన్నశ్రీ అనే మహిళ అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచారు. తన చేతికి ఉన్న గాజులను తీసి అమరావతి పరిరక్షణ జేఏసీకి విరాళంగా అందించి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి ఫలిస్తున్న సమయంలో ప్రభుత్వం మారడం భావితరాల దురదృష్టమని ఆవేదన వ్యక్తంచేశారు. విజయనగరంలో తమకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయని, విశాఖకు రాజధాని రావడం వల్ల ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ప్రసన్నశ్రీ తేల్చి చెప్పారు.