శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (10:36 IST)

భార్య పీక కోసి హత్య... చున్నీతో పిల్లలను కడతేర్చిన కర్కశకుడు!

కట్టుకున్న భార్యపై అనుమానమో.. అసహనమో... అప్పుల బాధో తెలియదుగానీ... భార్యను కత్తితో పీక కోసం చంపేశాడు. తన ఇద్దరు పిల్లలను చున్నీతో ఉరిబిగించి కడతేర్చాడో కర్కశకుడు. ఈ దారుణం విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ వాంబేకాలని డీ బ్లాకు ప్లాటు నెంబరు 373లో ఉల్లిపాయల వ్యాపారం చేసే బుగతా మోహన్‌కు భార్య నీలవేణి (26), బాబు రేవంత్‌కుమార్‌ అలియాస్‌ సాయి (7), పాప ఝాన్సీ ఉన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌లు, ఇతర చెడు వ్యసనాలకు బానిసయిన మోహన్‌ తరచూ అప్పులపాలవుతుంటాడు. బుధవారం రాత్రి 10 గంటల వరకు భార్యభర్తలు మాట్లాడుకుంటూ పిల్లలు సాయి, ఝాన్సీని పిలిచి ఇంట్లోకి తీసుకుని వెళ్లిపోయారు. 
 
గురువారం ఉదయం 6 గంటలకు ఇంటికి తాళం వేసి ఉండగా ఏసీ పని చేస్తుండటంతో అనుమానం వచ్చిన పక్కింటి వారు కిటికీలో నుంచి చూశారు. ఇద్దరు పిల్లలు మంచంపై పడి ఉండటం, భార్య రక్తపుమడుగులో కనిపించడంతో వెనుక తలుపు తొలగించి లోపలకు వెళ్లి చూసి పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసుల విచారణలో భర్త మోహన్‌ హత్య చేసి పరారాయినట్లు తేలింది. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తనకు రూ.15 లక్షలు అప్పులున్నాయని, భార్య, పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వేట్రాకు వద్దకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో నిందితుడు చెప్పినట్లు సమాచారం. 
 
అప్పుల సమస్యతోనే ఘాతుకానికి పాల్పడ్డాడా.. ఇతరత్రా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు నీలవేణి తల్లిదండ్రులు ఒరిస్సా సమీపంలో ఉండటంతో వారికి సమాచారం అందించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.