శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 18 మే 2021 (13:16 IST)

పరిశుభ్రత బాధ్యత గ్రామ సర్పంచులదే: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమ‌రావ‌తి: దివంగ‌త వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు అంటే జులై 8న ప్రారంభం కానున్న జగనన్న స్వచ్ఛ  సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే బాధ్యత సర్పంచులదేనని, ప్రతి ఒక్కరు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ఏర్పాటు చేసిన శిక్షాణా  కార్యక్రమాన్ని సోమవారం అంటే 17-5-2021న వెబ్ ఎక్స్ ద్వారా  మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది 1320  గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత  పక్ష ఉత్సవాలు నిర్వహించగా దీనిలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు ఇంటికి రూ. 2/- చొప్పున ఇచ్చిన విరాళాలు రూ. 3.83 కోట్లు,  వ్యర్ధాలపై వ్యతిరేఖ పోరాటం పేరుతో డిసెంబర్ 2 నుంచి 21 వరకు 4,737 గ్రామ పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా దీనిలో ప్రజలు పాల్గొని తమ వంతుగా  విరాళాలుగా రూ. 1.89 కోట్లు అందించారని  అన్నారు.

గ్రామాలన్నింటిలోనూ ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని, సర్పంచులు బాధ్యత తీసుకుని, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ ప్రజలకు అవగాహన పర్చాలని, కోవిడ్  నేపథ్యంలో జనంలో ఉన్న భయాందోళనలను పోగొట్టి, మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటించటం, పరిశుభ్రంగా ఉండటం వంటి అంశాలను అర్దమయ్యేలా వారికి తెలియజెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి  అన్నారు. మాస్క్ ధరించని వాళ్ళకు అపరాధ రుసుము వేయాలని, కోవిడ్  కేసులున్నట్లయితే బాధ్యతగా  వారిని ఆస్పత్రుల్లో చేర్పించాలని అంటూ  గ్రామంలో కొత్త కేసులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.

శిక్షణా కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ మాట్లాడుతూ, గ్రామస్తులకు భరోసాగా ఉంటారనే సర్పంచులుగా మిమ్మల్ని ఎన్నుకున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాలను పరిశుభ్రత నిలయాలుగా మార్చాలని, జగనన్న  స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించడానికి ప్రతి 200 ఇళ్లకు ఒక వ్యక్తిని నియమించాలని అంతకన్న ఎక్కువ ఇళ్లు ఉంటే సంఖ్యను బట్టి, నిధుల లభ్యతను బట్టి అదనంగా వ్యక్తులను నియమించుకుని వారి జీతాలను ఎప్పటికప్పుడు చెల్లించేలా అన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్ అన్నారు.

సేకరించిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ నిల్వ వుంచవద్దని, వాటికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అంటూ, మురుగుకాల్వలు పారేలా చూసుకుని, గ్రే వాటర్ ను ఇంకుడు గుంతలోకి వెళ్ళేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఈ బాధ్యతలను సర్పంచులు సక్రమంగా నిర్వహించి వారి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా రూపొందించుకోవాలని కమిషనర్ ఎం. గిరిజా శంకర్ కోరారు.
 
ఇజిఎస్ సంచాలకులు పి.చినతాతయ్య మాట్లాడుతూ గ్రామంలో అందరికీ జాబ్ కార్డులు ఉన్నాయో లేదో సర్పంచులు పరిశీలించాలని, లేని వారికి కొత్త జాబ్ కార్డులు జారీ చేసి ఎక్కువ మంది ఉపాధి పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాలను ఉపాధి హామీ నిధులతో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూలీలు పెద్దఎత్తున హాజరయ్యేలా చేయాలని కోరుతూ, కరోనా కష్టకాలంలో గ్రామాలకు చేరుకున్న వారందరికి పనులు కల్పించాలని అన్నారు.

జలశక్తి అభియాన్ పనులు అలాగే పేద రైతులకు ఉచిత బోర్లు వేస్తున్న వైఎస్ ఆర్ జలకళ కార్యక్రమాన్ని కూడా గ్రామ సర్పంచులు చొరవ చూపి, పర్యవేక్షించాలని ఇజిఎస్ సంచాలకులు చినతాతయ్య  సర్పంచులను కోరారు. శిక్షణ కార్యక్రమంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం, విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలు, కోవిడ్- తగిన ప్రవర్తన తదితర అంశాలపై నిపుణులు ప్రసంగించారు. రోజంతా జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి దాదాపు 2,100  మంది జిల్లా పరిషత్ సిఇఒలు, డిపిఒలు, ఎంపిడిఒలు, గ్రామ సర్పంచులు, హాజరయ్యారు. అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌.. కమిషనర్ కార్యాలయం నుంచి స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఎండి సంపత్ కుమార్, ఒఎస్‌డి దుర్గాప్రసాద్, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు వెబ్ ఎక్స్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.