1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 మే 2016 (19:47 IST)

ప్రత్యేక హోదా దేవుడెరుగ... ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పండి : విష్ణుకుమార్ రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం పక్కనబెట్టి.. విభజన చట్టం మేరకు ఇప్పటివరకు ఏపీకి ఇచ్చిన రూ.1.40 లక్షల కోట్ల నిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లెక్కలు చెప్పాలని బీజేపీ ఎల్పీ నేత పెన్మత్స విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఇవ్వాల్సిన అన్ని సౌకర్యాలు ఇస్తున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదాతో పనిలేదన్నారు. 
 
కేంద్ర నిధులపై రాష్ట్రప్రజలకు సమాచారం లేక అవగాహన లోపం ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపమని ఇప్పటికే అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన అన్నారు. కానీ దానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంలేదన్నారు. ఇచ్చిన నిధులకు ఎక్కడ లెక్కలు చెప్పాల్సి వస్తుందోనన్న భయంతోనే టీడీపీ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 
 
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇపుడే కాదు.. ఎప్పటికీ రాదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సిద్ధార్ధ్ నాథ్ సింగ్ శుక్రవారం విజయవాడలో తేల్చి చెప్పిన విషయంతెల్సిందే. విభజన చట్టంలో ఈ అంశం పేర్కొనలేదనీ, పైగా 14వ ఆర్థిక సంఘం నిబంధనలు దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఇవ్వరాదనీ పేర్కొంటున్నాయని సింగ్ గుర్తు చేశారు. అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన విషయం తెల్సిందే.