మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 26 జనవరి 2017 (02:42 IST)

జగనే కాదు సాగరతీరంలోకి ఎవరొస్తారో అదీ చూస్తాం : పోలీసు కమిషనర్ సవాల్

ప్రత్యేక హోదా డిమాండుతో ఆంధ్రప్రదేశ్ యువత అట్టుడికిపోతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో నేడు తలపెట్టిన హోదా అనుకూల ర్యాలీలు, మౌన దీక్షలు, జలదీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలకు ఎవరొస్తారో చూస్తామని ఏపీ పోలీసు శాఖ హెచ్చరించింది. విశాఖ ఆర్కే బీచ్‌కి ప్రతిపక్ష నేత

ప్రత్యేక హోదా డిమాండుతో ఆంధ్రప్రదేశ్ యువత అట్టుడికిపోతున్న నేపథ్యంలో  విశాఖపట్నంలో నేడు తలపెట్టిన హోదా అనుకూల ర్యాలీలు, మౌన దీక్షలు, జలదీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలకు ఎవరొస్తారో చూస్తామని ఏపీ పోలీసు శాఖ హెచ్చరించింది. విశాఖ ఆర్కే బీచ్‌కి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డే కాదు మరే రాజకీయ, రాజకీయేతర పార్టీల నేతలు వచ్చినా సాగరతీరంలోకి అడుగుపెట్టనివ్వమని, ఆందోళనలకు దిగితే ఎవరినీ సహించేది లేదని విశాఖ నగర పోలీసు కమిషనర్ టి. యోగానంద్ తేల్చి చెప్పారు.
 
గురువారం కొవ్వొత్తుల ర్యాలీలు, మౌన, జలదీక్షలు వంటివి చేపడతామని సిద్ధం అవుతున్న వారెవ్వరికి పోలీసు శాఖ అనుమతులు ఇవ్వలేదన్నారు. భద్రత దృష్ట్యా జనవరి 26, 27, 28 తేదీల్లో ఎటువంటి నిరసనలు, ఆందోళనను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఏ కార్యక్రమాన్ని అనుమతించమన్నారు. నిరసనలు, ధర్నాలపై అన్ని రాజకీయ పార్టీలు మరోసారి సమాలోచన చేయడం మంచిదని చెప్పారు. దీనిపై ఇప్పటికే రాజకీయ, రాజకీయేతర పార్టీలను హెచ్చరించడం జరిగిందన్నారు. 
 
విశాఖపట్నం కీలకమైన ప్రాంతమని ఇక్కడ తూర్పు నావికాదళంతో పాటు ప్రతిష్టాత్మకమైన సంస్థలు, కర్మాగారాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదా కావాలంటూ సాగర తీరాన నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం సరికాదన్నా రు. 26న గణతంత్ర దినోత్సవం కావడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేశమంతా రెడ్‌అలర్ట్‌ ఉందని పేర్కొన్నారు. 
 
తీర ప్రాంతంలో నివసించేవారు తమ గుర్తింపు కార్డు, నివాసధ్రువ పత్రం తమతో పాటు ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న మూడు వేల మంది పోలీసు సిబ్బందితో పాటు అదనంగా ప్రత్యేక దళాలను రప్పిస్తున్నామని అన్నారు. నగరంలోకి ప్రవేశించే అన్ని రహదారుల్లో పటిష్టమైన చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పక్క జిల్లాల నుంచి తరలివచ్చే వారిని నియంత్రించడంలో ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తామని తెలిపారు. అన్ని ప్రధాన కూడళ్లతో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పోలీస్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించామని వెల్లడించారు. 
 
ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని విశాఖ పోలీస్ కమిషనర్‌ యోగానంద్‌ చెప్పడమే కాకుండా సాగరతీరంలోకి ఎవరినీ అడుగుపెట్టనీయమని సవాలు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరి కొద్ది గంటల్లో ప్రత్యేక హోదా అనుకూల ర్యాలీలు, దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరుగనున్న సందర్భంగా సాగరతీరంలోకి జనం ఎలావస్తారన్నది పెను ప్రశ్నగా మారింది. ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయకపోతే ఇక తాము తలెత్తుకు తిరగలేమని చంద్రబాబు భావించడంతో పోలీసు బలగాలతో సాగర దీక్షలకు అడ్డు చెప్పాలని నిర్ణయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.