1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

కొత్త దంపతుల జీవితంలో పెను విషాదం మిగిల్చిన విహార యాత్ర

నూతన దంపతుల జీవితంలో విహార యాత్ర పెను విషాదం నింపింది. ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లా గులార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున బస్సు గంగా నదిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన జరజాన రవి (30) ప్రాణాలు కోల్పోయాడు. ఈయన భార్య కల్యాణి విషమ పరిస్థితుల్లో రిషికేష్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 
 
మొత్తం 11 మంది యాత్రికులతో కేదార్నాథ్ నుంచి వెళ్తున్న బస్సు మల్కుంటి బ్రిడ్జి-హోటల్ ఆనంద్ కాశీ మధ్య నదిలో కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటన రిషికేశ్ - బద్రీనాథ్ జాతీయ రహదారిపై జరిగింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఐదుగురిని రక్షించింది. రవి సహా ముగ్గురు చనిపోయారు. 
 
మృతుడు హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఈయనకు ఫిబ్రవరి నెల 12వ తేదీన కళ్యాణితో వివాహమైంది. ఈ నెల 5న వీరు యాత్రకు బయల్దేరారు. యమునోత్రి, గంగోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్‌కు టూర్ ప్లాన్ చేసుకున్నారు. కేదార్నాథ్ కొండపైకి వెళ్లేందుకు శనివారం సాయంత్రం రవి దంపతులు బస్సు ఎక్కి ప్రమాదంలో చిక్కుకున్నారు.