శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (09:52 IST)

అప్పులు.. తాగుడుకు బానిస.. భార్యను చంపేశాడు.. కన్నబిడ్డను కూడా?

అప్పులతో ఏర్పడిన గొడవలు ఓ తల్లీకూతురిని పొట్టనబెట్టుకుంది. అప్పుల బాధతో తాగుడుకు బానిసైన భర్తను భార్య మందలించింది. ప్రవర్తనను మార్చుకోమంది. అంతే కోపంతో ఊగిపోయిన భర్త.. భార్యను హతమార్చడమే కాకుండా.. కన్నకూతురుని కూడా పొట్టనబెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ నగరంలోని ఉర్సు గుట్ట ప్రాంతం, స్థానిక బీఆర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు ప్రైవేట్‌ ఉద్యోగి. 
 
పదేళ్ల కిందట రమ్య (29)తో వివాహమైంది. వ్యాపారాల పేరుతో అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయి తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం భార్యతో గొడవ పడుతూ ఆమెను హింసించేవాడు. దీంతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజులు కిందట పుట్టింటికి వెళ్లిన భార్యను తనప్రవర్తన మార్చుకుంటానని నమ్మించి తిరిగి తీసుకొచ్చాడు. 
 
ఆదివారం ఉదయం మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు రమ్యతో గొడవపడ్డాడు. గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణాన్ని చూసిందన్న కారణంతో కుమార్తె మనస్విని(8)ని కూడా గొంతు నులిమి హత్య చేశాడు.
 
ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు రమ్య, మనస్విని మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్టు మార్టం కోసం తరలించారు. ఆపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.