మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (18:10 IST)

ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధం.. రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన తరుణంలో రెగ్యులర్ రైళ్లను నడపడం ఇప్పుడే సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. అయితే, త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నట్లు  రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. 
 
సొంతూళ్లకు వెళ్లిన వలస కూలీలు మళ్లీ ఉపాధి కోసం నగరాల బాట పట్టడం సంతోషకరమని, ఆర్థిక రంగం కుదుటపడుతోందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఈ వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఆక్యుపెన్సీని పరిశీలిస్తున్నామని, రాష్ట్రాలు కోరితే మరిన్ని సమకూర్చేందుకు సిద్ధమేనని వెల్లడించారు.
 
ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి శ్రామికులు ఎక్కువగా తాము గతంలో పనిచేసిన ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారన్నారు. జూన్‌ 25 వరకు మొత్తం 4,594 శ్రామిక్‌ రైల్‌ సర్వీసులను నడిపామని, మే 1వ తేదీ నుంచి మొత్తం 62.8 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామని వివరించారు. తిరిగి ప్రత్యేక రైళ్లను శ్రామికుల కోసం నడిపేందుకు సిద్ధమన్నారు.