విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లు పెట్రేగిపోతున్నారు. ఇప్పటికే అత్యాచారాలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ వచ్చిన వారు.. తాజాగా ఏకంగా హత్య చేశారు. విశాఖపట్టణంలో ఒక వాలంటీర్ ఏకంగా ఓ వృద్ధురాలిని చంపేశాడు. మృతురాలిని వరలక్ష్మిగా గుర్తించారు. ఆమె వద్ద ఉన్న బంగారం, డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు.
దీనిపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ హత్యకు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలంతా బాధ్యులమేనని చెప్పారు. ఈ హత్యకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
వాలంటీర్లు చేస్తున్న పని ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేయడం మినహా వారు చేస్తున్న పని ఏమిటని నిలదీశారు. మహిళల ఫోటోలను కూడా వాలంటీర్లు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. పింఛన్‌ను వార్డు సభ్యుడు కూడా ఇవ్వొచ్చని లేదా పింఛన్ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయొచ్చని ఆయన సూచించారు.
ఒక ఇంటి నంబరుపై 500కు పైగా దొంగ ఓట్లను నమోదు చేశారని, దొంగ ఓట్లు ఉన్న వారి పింఛన్ ఎవరి ఖాతాల్లోకి వెళుతుందని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వం సిగ్గు లేకుండా కేసు పెట్టిందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.