మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 31 జులై 2023 (14:26 IST)

ఇప్పటికిపుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?

andhra pradesh map
వచ్చే యేడాది దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సంస్థలు ఒపీనియన్ పోల్ నిర్వహించాయి. ఈ సర్వేలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఆసక్తికర అంచనాలు వెలువడ్డాయి.
 
ఏపీలో వైసీపీ ఆధిక్యత కొనసాగుతుందని... అయితే, కొన్ని సీట్లను కోల్పోతుందని ఒపీనియన్ పోల్ తెలిపింది. ఇదేసమయంలో టీడీపీ పుంజుకుంటుందని వెల్లడించింది. ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలలో వైకాపా 18 సీట్లను గెలుచుకుంటుందని తెలిపింది. గతంలో 22 సీట్లను గెలుచుకున్న వైసీపీ... ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే 4 సీట్లను కోల్పోతుందని చెప్పింది. 
 
అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 3 సీట్లను మాత్రమే గెలుచుకున్న టీడీపీ... మరో 4 స్థానాలను కైవసం చేసుకుని... 7 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్‌సభ స్థానాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలను గెలుచుకుంటుందని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. 
 
బీజేపీ ఆధిక్యతను పెంచుకోబోతోందని... కాషాయం పార్టీకి 6 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ రెండు, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని తెలిపింది. సర్వే ప్రకారం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కో సీటును కోల్పోనున్నాయి. బీజేపీ 2 సీట్లను పెంచుకోనుంది. అయితే రాబోయే రోజుల్లో వివిధ పార్టీల మధ్య పొత్తులు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయని వెల్లడించింది.