శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2019 (06:00 IST)

చేనేతలకు రూ. 24 వేలు, మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేలు.. మంత్రి మండలి

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చేనేత మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చేనేత కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించడంలో భాగంగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పేరుతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు చొప్పున.. డిసెంబర్ 21 నుంచి అందించే విధంగా రాష్ట్ర మంత్రివర్గం  నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర రవాణా, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామమ్య (నాని) వెల్లడించారు.

బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రివర్గం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సచివాలయంలోని 4 వ బ్లాక్ నందు పబ్లిసిటీ సెల్ నందు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం అమలులో ఉన్నందున.. ఆ కాలంలో మోటరైజ్డ్, మెకనైజ్డ్, తెప్ప పడవలు, నాన్ మోటరైడ్జ్ కుటుంబాలకు చెందిన మత్యకారులకు ‘వైఎస్సార్  మత్స్యకారుల వేట నిషేధ సహకారం’ కింద రూ. 10 వేలు.. నవంబర్ 21 నుంచి అమలు చేయడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు.

అంతే కాకుండా మత్స్యకారులకు అందించే డీజిల్ సబ్సిడీని 50 శాతం పెంపుతో.. లీటర్ కు రూ. 9 చొప్పున కోస్తాలోని 9 జిల్లాలో 81 షాపుల్లో అమలు చేయుటకు చర్యలు చేపట్టడం జరిగిందని.. ఇందుకోసం 96.06 కోట్ల రూపాయులు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మత్స్యకారుల దినోత్సవం అయిన నవంబర్ 21 నుంచి అమలు చేయుటకు మంత్రి వర్గం ఆమోదించింది.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో జీఎస్పీసీ (గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్) తవ్వకాల కారణంగా ఉపాధి కోల్పోయిన 16,654 మంది మత్స్యకారులకు చెల్లించాల్సిన రూ. 80 కోట్ల బకాయిలను ఓఎన్ జీసీ చెల్లించేందుకు ముందుకు రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 21 నుంచి బాధితులకు చెల్లించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 4 కోట్ల 80 లక్షల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి.. మారు మూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం మంచినీరు అందించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

అదే విధంగా రూ. 211.91 కోట్లతో రాష్ట్రంలోని 88,296 మంది మధ్యాహ్నా భోజన కార్మికులకు లబ్ధి చేకూరే విధంగా వారికిచ్చే గౌరవ వేతనాన్ని రూ. 1000 నుంచి 3 వేలకు పెంచేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు. అలాగే హోంగార్డులకు చెల్లించే దినసరి భత్యంను రూ.600 నుంచి రూ.710 కు పెంచేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిబంధనల మేరకు వారికి చెల్లించాల్సిన మొత్తం పైకం వారివారి అకౌంట్లలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని.. దాని ద్వారా దళారీ వ్యవస్థను రూపుమాపడం, పారదర్శకతకు పెద్ద పీట వేయడం జరుగుతుందన్నారు.

పలాసలో రూ. 50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిలో 5 రెగ్యులర్ పోస్టులు, 100 కాంట్రాక్ట్ పోస్టులు, 60 ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. బార్ అసోసియేషన్ లో నమోదైన 3 ఏళ్లలోపు ఉన్న జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేల వంతున స్టై ఫండ్ చెల్లించేందుకు కేబినెట్ నిర్ణయించందని.. సదరు పథకాన్ని డిసెంబర్ 3న  జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు మంత్రిమండలి తీర్మానించిందన్నారు.

అదే విధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం మరియు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బోర్ వెల్ ల ఏర్పాటు చేసేందుకు 200 డ్రిల్లింగ్ బోరు మిషన్ ల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ ద్వారా ‘వైఎస్సార్ ఆదర్శం పథకం’ కింద ట్రక్కులు, రవాణా వాహనాలు కొనుగోలు చేసి ఇసుక రవాణా, పౌరసరఫరాల శాఖతో సహా ప్రభుత్వం వాడే ప్రతి రవాణా ప్రక్రియలో స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

ట్రక్కులు కొనుగోలుకు బ్యాంకులలో పూచీకత్తును ప్రభుత్వమే ఏర్పాటు చేసి ట్రక్కులు కొనుగోలు చేయడం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు రూ. 20 వేలు ఆదాయం వచ్చేలా విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ నిర్ణయించడం జరిగిందన్నారు. ఆర్టీసీలో కాలం చెల్లిన 3,500  బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

పౌరసరఫరాల సంస్థ రుణ పరిమితిని అదనంగా రూ. 2 వేల కోట్లకు పెంచాలని, ఆర్ధిక సంక్షోభంలో ఉన్న డిస్కమ్ లకు ఊరటనిచ్చేందుకు రూ. 4,741 కోట్ల మేర బాండ్లు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో జాతీయ విపత్తు నివారణ సంస్థకు 39.23 ఎకరాల భూమి,  ప్రకాశం జిల్లా నడికుడి -  శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ నిర్మాణానికి 350 ఎకరాల భూమి మరియు రేణిగుంట ఎయిర్ పోర్టు విస్తరణకు సంబంధించి 17 ఎకరాల భూమి కేటాయింపునకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెంపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.  విశాఖపట్నంలో పరదేశిపాలెంలో ఆమోద పబ్లికేషన్ కు కేటాయించిన 1.5 ఎకరాల భూమిలో ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టనందున సదరు సంస్థకు ఇచ్చిన భూమి కేటాయింపు నిర్ణయాన్ని రద్దు చేసి ఆ భూమిని బలహీన వర్గాల గృహాసముదాయానికి కేటాయించాలని మంత్రి వర్గం నిర్ణయించిందన్నారు.

ఇకపై దినపత్రికలలో ఇచ్చే ప్రకటనలకు సంబంధించిన టారిఫ్ లను పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు. అదే విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ యాక్ట్ పై ఆర్డినెన్స్ కు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు.

అంతేకాకుండా యూనివర్సిటీ బోర్డుల్లో సభ్యులుగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిలు సభ్యుల ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు.