సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 31 జులై 2019 (22:16 IST)

మోడీ క్యాబినెట్‌లో సుజనా, పురంధేశ్వరి? ఏపీలో చక్రం తిప్పేందుకేనట...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బీజేపీ నాయకత్వం ఎవరికీ ప్రాధాన్యత ఇస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భవిష్యత్తులో మోడీ కేబినెట్‌లో సుజనా చౌదరి, పురందేశ్వరిలలో ఎవరికి చోటు దక్కుతోందనే చర్చ సాగుతోంది.
 
మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి టీడీపీ నుండి బీజేపీలో చేరారు. తనతో పాటు మరో ముగ్గురు రాజ్యసభ సభ సభ్యులను కూడ బీజేపీలో చేర్పించడంలో సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారు.
 
 విజయవాడ ఎంపీగా విజయం సాధించిన నాని బీజేపీలో చేరుతారని కూడ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని నాని ఖండించారు. టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు ఈ ప్రచారాన్ని ఖండించారు. బీజేపీలో తాను చేరడం లేదని నాని బుధవారం నాడు స్పష్టం చేశారు.
 
 ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసేందుకు సుజనాచౌదరికి కీలకపదవిని ఇవ్వాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ తరుణంలో సుజనా చౌదరి మోడీ కేబినెట్ లో చోటు కోసం ఆశగా ఉన్నారని చెబుతున్నారు.
 
మోడీ కేబినెట్ లో సుజనా చౌదరి గతంలో పనిచేశారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో సుజనా చౌదరి టీడీపీ తరపున మోడీ కేబినెట్ లో చోటు దక్కించుకొన్నారు. 
 
ఏపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకొనే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకత్వం సుజనా చౌదరికి కీలకమైన పదవిని ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. 
 
సుజనా చౌదరికి కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఏపీలో టీడీపీ నేతలపై మరింతగా కేంద్రీకరించేందుకు అవకాశం ఉంటుందని వాదించే వాళ్లు లేకపోలేదు. అయితే టీడీపీ నుండి చేరిన సుజనాకు వెంటనే మంత్రి పదవిని ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడే వాళ్లు కూడ లేకపోలేదు.
 
 మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీకి కూడ కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. 2018లోనే పురందేశ్వరీకి రాజ్యసభ లో అవకాశం కల్పించాలని మోడీ భావించినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాలతో పురంధేశ్వరీకి రాజ్యసభ అవకాశం దక్కలేదు. 
 
రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తే కేబినెట్ లో పురందేశ్వరీకి కూడ చోటును కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో పురందేశ్వరీ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.
 
 మంత్రిగా ఆమె పనితీరును సోనియాతో పాటు మన్మోహన్ సింగ్ కూడ అభినందించారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో పురందేశ్వరీకి కీలకపదవిని కట్టబెడితే పార్టీకి ప్రయోజనం ఉంటుందని వాదించే వాళ్లు కూడ లేకపోలేదు.
 
కొడుకు, భర్త వైఎస్ఆర్‌సీపీలో చేరినా కూడ పురంధేశ్వరీ మాత్రం బీజేపీలోనే కొనసాగారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పురంధేశ్వరికీ చోటు కల్పించడం వల్ల పార్టీ శ్రేణులకు మంచి సంకేతాలను పంపే అవకాశాలు ఉన్నాయని వాదించే వాళ్లు కూడ లేకపోలేదు.
 
ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ తరుణంలో తమకు రాజకీయంగా ఉపయోగపడే నిర్ణయాన్ని ఆ పార్టీ నాయకత్వం తీసుకొనే అవకాశం ఉంది. అయితే దీనికి ఎవరు మెరుగ్గా ఉపయోగపడుతారో వారికే పదవులు కట్టబెట్టే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.