సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (17:38 IST)

మూక దాడుల నుంచి రక్షణ కల్పించండి ప్లీజ్.. ప్రధానికి సెలెబ్రిటీల లేఖ

దేశంలో వివిధ ప్రాంతాల్లో మూకదాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని పలువురు సెలెబ్రిటీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖ రాసిన 49 మంది సెలెబ్రిటీలలో సినీ, పాత్రికేయ రంగానికి చెందిన శ్యామ్ బెనగల్, అనురాగ్ కశ్యప్, రామచంద్ర గుహ తదితరులు ఉన్నారు.
 
దేశంలో అసహనం, మూకదాడులు హెచ్చుమీరిపోతున్నాయనీ, ఇప్పటివరకు 1094 దాడులు జరిగాయని లేఖలో తెలిపారు. కులం పేరుతో దళితులు, ముస్లింలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని వారు కోరారు. దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 
 
మూకదాడుల కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు విధించాలని, పెరోల్ కూడా ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. జైశ్రీరామ్ పేరుతో మూకదాడులు చేయడం బాధాకరం అన్నారు. జైశ్రీరామ్ పేరుతో శాంతి భద్రతల సమస్యలు సష్టించడాన్ని తప్పుపట్టారు. దేశంలో పరిస్థితులు మరింత దిగజారకముందే ప్రధాని మోడీ చర్యలు చేపట్టాలని సెలబ్రిటీలు విజ్ఞప్తి చేశారు. 
 
ఇప్పటికే దళితులు, మైనార్టీలు అభద్రతా భావంలో ఉన్నారని.. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకున్నారని సెలబ్రిటీలు వాపోయారు. ఎప్పుడు ఎక్కడ మూకదాడులు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇది మంచి పరిణామం కాదన్నారు. దళితులు, మైనార్టీలకు ప్రభుత్వం అండగా నిలవాలని.. భద్రతపై వారికి భరోసా కల్పించాలని సెలబ్రిటీలు ప్రధానిని డిమాండ్ చేశారు. అసహనం, మూకదాడులను ప్రస్తావిస్తూ 49 మంది సెలబ్రిటీలు ప్రధాని మోడీకి లేఖ రాయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.