శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (16:05 IST)

చేపను బిర్యానీలో వేశాడు.. బల్లి అని మోసం చేశాడు.. చివరికి దొరికిపోయాడు..

బిర్యానీలో బల్లి పడిందని బాగా డబ్బు గుంజాలనుకున్నాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన సుందర్ పాల్ అనే వ్యక్తి... ముంబై నుంచి కోయంబత్తూరు వెళ్తూ గుంతకల్ జంక్షన్‌లో దిగాడు. అక్కడ ఫ్లాట్ ఫామ్‌లో వున్న క్యాటరింగ్ స్టాల్‌లో బిర్యానీ ఆర్డర్ చేసి.. సగం తిన్నాడు. 
 
సగం తిన్న తర్వాత బిర్యానీలో బల్లి ఉందని, దాన్ని తినడంతో తనకు అస్వస్థత కలిగిందంటూ స్టాల్ యజమానికి చెప్పాడు. దాంతో ఆయన రైల్వే వైద్యబృందానికి సమాచారం అందించడంతో వారు వచ్చి సుందర్ పాల్ కు చికిత్స చేశారు. 
 
ఈ విషయాన్ని పెద్దది చేస్తానని సుందర్ పాల్ చెప్పడంతో జడుసుకుని ఓనర్ ఐదు వేల రూపాయలు ఇచ్చేశాడు. ఈ వ్యవహారం గుంతకల్ అసిస్టెంట్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వరకు వెళ్లడంతో ఆయన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సాయంతో విచారించారు. 
 
మూడు రోజుల కిందట ఇలాగే జబల్ పూర్ రైల్వే స్టేషన్‌లో కూడా ఓ వ్యక్తి సమోసాలో బల్లి ఉందంటూ రూ.50 వేలు వసూలు చేసినట్టు తెలియడంతో అతడి ఫొటోలు తెప్పించి చూశారు. అందులో ఉన్న వ్యక్తి, తమ ఎదురుగా ఉన్న సుందర్ పాల్ ఒక్కరేనని తెలిసింది. 
 
గట్టిగా నిలదీయడంతో సుందర్ పాల్ తన మోసాలను ఒప్పేసుకున్నాడు. చేపను బిర్యానీలో వేసి బల్లి అని మోసం చేసినట్లు అంగీకరించాడు. సుందర్ పాల్‌పై కఠినచర్యలు తీసుకునేందుకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు.