చెన్నైలో పట్టపగలు కత్తులతో విద్యార్థుల హల్చల్.. నడిరోడ్డుపై నరుక్కున్నారు...
చెన్నైలో పట్టపగలే నడిరోడ్డుపై కళాశాల విద్యార్థులు కత్తులతో హల్చల్ చేశారు. అరంబాక్కం ప్రాంతంలో కత్తులతో విద్యార్థులు ఘర్షణకు దిగారు. పచ్చియప్పన్ కళాశాలకు చెందిన విద్యార్థుల మధ్య కళాశాలలో జరిగిన గొడవే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పెరంబూరు నుంచి తిరువేక్కాడు వైపు వెళుతున్న బస్సులో 10 మంది పచ్చయాప్పన్ కళాశాలకు చెందిన విద్యార్థులు వెళుతున్నారు. అరంబాక్కం సిగ్నల్ వద్దకు రాగానే కత్తులతో ఉన్న పచ్చయప్పన్ కళాశాలకు చెందిన విద్యార్థులు బస్సును నిలిపారు.
ఒక్కసారిగా బస్సులోకి ఎక్కి విద్యార్థులపై కత్తులతో ఇద్దరు విద్యార్థులపై దాడి చేశారు. దీంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు విద్యార్థులు బస్సు నుంచి కిందకు దూకి పరుగులు తీస్తుంటే కత్తులతో రోడ్డుపైకి పరుగెత్తుతూ వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. కళాశాలలో స్నేహితుల మధ్య మనస్పర్థలు గొడవకు దారితీసిందని కళాశాల నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనతో 10 మంది విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేసింది కళాశాల యాజమాన్యం.