వేలేరుపాడులో వైద్యం వికటించి బాలింత మృతి : వైద్య మంత్రి సీరియస్
వేలేరుపాడులో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాన్ని సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర సమాచారాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సునందను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడ ఆర్ఎంపీలు పరిధి ధాటి వైద్యం అందిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో శ్రీనివాస్ నర్సింగ్ హోం హాస్పిటల్‌లో జరిగిన ఈ ఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు. బాలింత మృతికి బాద్యులైన ఆర్ఎంపీ వైద్యుడుపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను మంత్రి ఆదేశించారు.
బాలింత మృతిపై ఒక సీనియర్ గైనకాలజిస్టును విచారణ అధికారిగా నియమించారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు.
అలాగే, వేలేరుపాడులో హాస్పిటల్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత
పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో ఫోనులో మాట్లాడి మృతి చెందిన బాలింత నాగమణి కుటుంబానికి అండగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా హాస్పిటల్స్ నిర్వహిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బాలింత మృతికి కారణమైన ఆర్ఎంపీ వైద్యుడుపై క్రిమినల్ కేసు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యాధికారులు మంత్రికి వివరించారు.