పెళ్లికి ముందే శారీరకసంబంధం.. ప్రియుడిపై మోజుతో భర్తను చంపేసిన భార్య...
పశ్చిమగోదావరి జిల్లా కొత్తూరులో ఓ వివాహేతర సంబంధం హత్య కేసులోని మిస్టరీ వీడింది. ఈ కేసులో ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను భార్యే హత్యచేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని భామిని మండలం లొహరిజోలకు చెందిన నల్లకేవటి కుమారస్వామి అనే వ్యక్తికి 2012లో నేరడికి చెందిన మాలతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
పెళ్లికి ముందే మాలతికి తాతగారి గ్రామమైన గంగువాడకు చెందిన పెనబాకల హేమసుందర్ అలియాస్ శ్యామ్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇంతలో మాలతికి కుమారస్వామితో, శ్యామ్‌కు వేరే మహిళతో వివాహాలు జరిగాయి.
కానీ వీరి మధ్య వివాహేతర సంబంధం మాత్రం కొనసాగుతూ వస్తోంది. అయితే తరచూ వివాదాలు నడుస్తుండడంతో కుమారస్వామి అడ్డు తొలగించుకోవడానికి మాలతి, శ్యామ్‌లు నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా, ఈ నెల 25న పర్లాకిమిడిలోని పెద్దనాన్నకు ఆరోగ్యం బాగాలేదని మాలతి భర్త కుమారస్వామితో చెప్పింది. దీంతో భార్య, పిల్లలతో కలిసి కుమారస్వామి స్కూటీపై బయలుదేరాడు.
ఇదే విషయాన్ని మాలతి ప్రియుడు శ్యామ్‌కు చేరవేసింది. ముందస్తు వ్యూహంతో బాలేరు సమీపంలోకి వచ్చేసరికి శ్యామ్ బైక్‌తో స్కూటీని ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన కుమారస్వామిని అతి కిరాతకంగా కత్తితో దాడిచేశాడు. దీంతో కుమారస్వామి ఘటనాస్థలంలోనే కన్నుమూశాడు.
సమాచారమందుకున్న పాలకొండ డీఎస్పీ శ్రావణి, సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ సురేష్‌లు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అన్ని కోణాలో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వాడిన ఆయుధాలు, సెల్‌ఫోన్ల ఆధారంగా విచారించారు. భార్య మాలతి ప్రోత్సాహంతోనే ప్రియుడు శ్యామ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్థారించి వారిని అరెస్ట్ చేశారు. మరో మైనర్ సహకరించినట్టు పోలీసులు తెలిపారు.