శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 28 జనవరి 2021 (21:52 IST)

భార్య అంటే ప్రాణం.. కానీ చంపేశాడు, ఎందుకు?

చిత్తూరుజిల్లా మదనపల్లెలో ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తే ఆమెను అతి దారుణంగా చంపాడు. ఇద్దరు కలిసి గాఢంగా ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. కానీ అనుమానం పెనుభూతమై వారి కుటుంబంలో చివరకు విషాదాన్ని మిగిల్చింది.
 
మదనపల్లె సమీపంలోని నీరుగుట్టవారిపల్లిలోని రాజానగర్‌లో రామాంజనేయుడు, అతని భార్య ఉమ నివాసముంటున్నారు. ఉమ స్వగ్రామం తిరుపతిలోని మంగళం. రామాంజనేయుడు స్వగ్రామం అనంతపురం జిల్లా ధర్మవరం. ఇద్దరూ తిరుపతిలోని కళాశాలలో ఇంటర్ చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు.
 
ఇద్దరూ వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. అయినా సరే వీరిద్దరు పెళ్ళి చేసుకున్నారు. సరిగ్గా రెండునెలల క్రితమే వీరి వివాహం జరిగింది. రామాంజనేయుడు తన స్నేహితుని సహకారంతో మదనపల్లెలో మకాం పెట్టాడు. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబం. 
 
కానీ రామాంజనేయుడు భార్యపై అనుమానం పెట్టుకున్నాడు. తాను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భార్య ఎవరితోనో గడుపుతోందని అనుమానంతో భార్యతో గొడవపడ్డాడు. నువ్వే సర్వస్వమని భార్య చెప్పినా వినిపించుకోలేదు. ఈరోజు సాయంత్ర ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో కోపంతో ఇంటి పక్కనే ఉన్న ఇటుక రాయిని తీసుకొచ్చి ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఉమ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు.