మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (12:01 IST)

ప్రేమించినోడితో పెళ్లి చేస్తారా లేదా... చావమంటారా? యువతి హల్చల్

తాను ప్రేమించినోడితో పెళ్లి చేయాలంటూ ఓ యువతి పట్టుబట్టింది. తన ప్రియుడితో పెళ్లి చేయకుంటే వాటర్ ట్యాంకుపై నుంచి దూకేస్తానంటూ బెదిరిస్తూ హల్చల్ సృష్టించింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక బెత్లహాంపేటకు చెందిన పెట్టెల కేశవాణి అనే యువతి తన మేనమామ కుమారుడైన యడ్ల భాస్కర్‌ను గత ఏడేళ్లుగా ప్రేమిస్తోంది. 
 
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ రెండు రోజుల క్రితం తన ప్రియుడు వద్ద ప్రస్తావించింది. అందుకు భాస్కర్ నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో శనివారం స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేసింది.
 
భాస్కర్‌తో తనకు వివాహం చేయకుంటే పైనుంచి దూకేస్తానని హెచ్చరిస్తూ కుటుంబ సభ్యులకు వాట్సాప్ వీడియో పంపింది. అది చూసి కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతితో ఫోన్‌లో మాట్లాడారు. భాస్కర్‌ను తీసుకొచ్చి వివాహానికి ఒప్పించారు. దీంతో కేశవాణి కిందికి దిగింది. అనంతరం ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత సమీపంలోని ఆలయానికి తీసుకెళ్లి ఇద్దరికీ వివాహం జరిపించడంతో కథ సుఖాంతమైంది.