శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 25 జనవరి 2017 (03:21 IST)

పవన్‌ని ఇంప్రెస్ చేయాలని నా పరువు పూర్తిగా పోగొట్టుకోవాలా.. చంద్రబాబు మథనం

పవన్ ఎన్ని విమర్శలైనా చేయనీ.. ఫర్వాలేదు. కానీ తన ఇమేజిని, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అదును చూసుకుని పవన్ విమర్శల వర్షం కురిపిస్తున్నప్పుడు ఆయన వైఖరిని భరిస్తూ చూస్తూ ఊరుకోవాలా అనే ఆలోచన చంద్రబాబును కొన్నాళ్లుగా వేధిస్తూనే ఉంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌కి ఎక్కడో చెడిందన్నది కొత్త విషయం ఏమీ కాదు. చాలా కాలంగా వీరిద్దరి మధ్య దోబూచులాటలు, నర్మగర్బపు విసుర్లు చోటు చేసుకోవడం జనం కంట పడుతూనే ఉంది. పవన్ ఎన్ని విమర్శలైనా చేయనీ.. ఫర్వాలేదు. కానీ తన ఇమేజిని, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అదును చూసుకుని పవన్ విమర్శల వర్షం కురిపిస్తున్నప్పుడు ఆయన వైఖరిని భరిస్తూ చూస్తూ ఊరుకోవాలా అనే ఆలోచన  చంద్రబాబును కొన్నాళ్లుగా వేధిస్తూనే ఉంది. 
 
పోలవరం, అమరావతి రైతులకు ప్యాకేజీ విషయమై రైతులకు వారు కోరిన పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటీ అని జనం ముందరే పవన్ ప్రశ్నించడం వ్యక్తిగతంగా చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వానికి గాలి తీసినట్లయింది. అందుకే ఆ మరుసటి దినమే భూసేకరణ, రైతులకు నష్టపరిహారంలో విధివిధానాలు పవన్‌కు తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియకుండా మాట్లాడుతున్నారా అంటూ టీడీపీ వర్గాలు బాహాటంగానే ప్రకటించారు. 
 
ఇక తమిళనాడు జల్లికట్టు ఉదంతాన్ని చూపి ఆంధ్రలో కూడా ప్రత్యేక హోదాకు ఆస్థాయి పోరాటం చేయాల్సిందేనని పవన్ ట్వీట్ చేయడంతో చంద్రబాబు కోవం పగ్గాలు తెంచుకుందని సమాచారం. జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు ఏం సంబంధం.. ఏదేదో మాట్లాడుతున్నారు అంటూ చంద్రబాబు విసురుగా వ్యాఖ్యానించడం దీంట్లో భాగమే.
 
కొంతమంది వ్యక్తులు చెప్పింది గీటురాయిగా తీసుకుని పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని, తమ ప్రభత్వంపై తీవ్య వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు గట్టి నిర్ణయానికి వచ్చేసినట్లే సమాచారం. అందుకే గత రెండున్నరేళ్లకు పైగా పాలనలో ఎన్నడూ లేనంత తీవ్రంగా బాబు పవన్‌పై చిరాకు ప్రదర్శిస్తూ మాట్లాడారు. పుండు మీద కారం జల్లిన చందంగా తాను సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడానికి ఒక రోజు ముందర పవన్ విశాఖలో ప్రత్యేక హోదా నిరసన ప్రదర్శనకు పిలుపివ్వడంతో బాబు సహనం పూర్తిగా సహించిందని భావిస్తున్నారు 
 
అయితే ఒక విషయం మాత్రం నిజం. చంద్రబాబులో సహనం ఒక పాయింటువరకే ఉంటుందని, దాన్ని మీరితే ఎంత కఠిన నిర్ణయానికైనా సిద్ధపడతారని ముద్రగడ ఉదంతంతోనే తేలిపోయింది.  కాబట్టి పవన్ కల్యాణ్‌ని ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నంలో బాబు తన వ్యక్తిగత ఇమేజీని, తన ప్రభుత్వ ఇమేజీని ఫణంగా పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడనేది టీడీపీ వర్గాల అభిప్రాయం. సహనం కోల్పోయి పవన్ ప్రశ్నలకు అదే స్థాయిలో బాబు రివర్స్ సమాధానం ఇస్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఆరోజే భూకంపం పుట్టకం తప్పదు. 
 
ఆ రోజు రావడానికి ఎక్కువ కాలం పట్టదనేందుకు సంకేతాలు వెలువడుతున్నాయి. జనవరి 26న అంటే రేపు విశాఖలోని ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం భారీ జనసందోహం గుమికూడితే, అందులో పవన్ పాల్గొంటే,, జనాలను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం కొరడా ఝళిపిస్తే అసలైన తమాషా అప్పుడే మొదలవుతుంది. మొత్తం మీద చంద్రబాబు, పవన్‌ల మధ్య హనీమూన్ బ్రేక్ అయ్యే సమయం సమీపిస్తోందా? వేచి చూడాల్సిందే.