కొడాలి నానికి మంత్రిపదవి ఎందుకు ఇచ్చారంటే...
గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రిపదవి దక్కింది. ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన 25 మంది మంత్రుల్లో కొడాలి నానికి చోటు కల్పించారు. కొడాలి నానికి మంత్రి పదవి దక్కడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, వైకాపా నేతల్లో మాత్రం చర్చనీయాంశంగా మారింది. అసలు కొడాలి నానికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో పరిశీలిద్ధాం.
స్వర్గీయ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన కొడాలి నాని తన రాజకీయ అరంగేట్రం టీడీపీ నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు.. జిల్లా నాయకత్వాన్ని విభేదించి వైకాపాలో చేరారు. కొడాలి నాని వైసీపీలో చేరికతో కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కింది. నాని వైసీపీలో చేరినప్పటి నుంచి జగన్‌కు అత్యంత నమ్మకంగా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసిన సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా కొడాలి నాని అక్రమ కేసులని తప్పు పట్టారు.
అలాగే, అవినీతి కేసుల్లో చిక్కుకుని జైల్లో రిమాండ్‌లో ఉన్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని జైల్లో కలిశారు. అంతేకాకుండా, వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గానికి నిధులు భారీగా కేటాయించి ఎంతో అభివృద్ధి చేశారు. దీన్ని కొడాలి నాని బహిరంగంగా కొనియాడారు. అంతేనా, ప్రతిపక్ష ఎమ్మెల్యే అనికూడా చూడకుండా గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన వైఎస్ కుటుంబానికి అండగా ఉంటానని ఆ సందర్భంలోనే కొడాలి నాని ప్రకటించారు.
అదేసమయంలో 2013లో శాసనసభలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుపై వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా టీడీపీ ఎమ్మెల్యే హోదాలో కొడాలి నాని ఓటు వేశారు. దీంతో కొడాలి నానిని టీడీపీ నుంచి అధిష్టానం బహిష్కరించింది. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. వైసీపీ మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ.. అసెంబ్లీలో జగన్‌పై టీడీపీ నేతల మాటల దాడికి కొడాలి నాని ఎదురొడ్డి నిలిచేవారు. ఫలితంగానే నానికి జగన్ తన జట్టులో చోటు కల్పించారు.