గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (23:10 IST)

డబ్బు కోసం సీఎం పదవినీ అమ్మేస్తారేమో?: సాకే శైలాజనాథ్

సంక్షేమ పధకాల అమలు కోసం ఆస్తుల తనఖా పెట్టినట్లే ప్రభుత్వాన్ని కూడా తనఖా పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్  ఎద్దేవా చేశారు. డబ్బుల కోసం సీఎం పదవిని కూడా అమ్మేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

శనివారం ఆయన ఆంధ్ర రత్న భవన్ నుండి విడుదల చేసిన ఓ ప్రకటనలో అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖలోని రూ.2,954 కోట్ల మార్కెట్ విలువ ఉన్న ప్రభుత్వ ఆస్తులను రాష్ట్రప్రభుత్వం తనఖా పెట్టేసిందని, ఈ తనఖా ఒప్పందంలో ప్రభుత్వమే వాటి మార్కెట్ విలువను నిర్ధారించి పేర్కొందని, విశాఖలోని మొత్తం 13 ఆస్తులుగా ఉన్న 128.70 ఎకరాలను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీకి తనఖా పెట్టిందని, ఈ మేరకు తనఖా రిజిస్ట్రేషన్ పూర్తి చేసిందన్నారు.

ఏపీఎస్డీసీ ద్వారా రూ.25,000 కోట్ల రుణం తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పటికే రూ.21,500 కోట్ల అప్పులు ప్రభుత్వం తీసుకుందన్నారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.18,500 కోట్ల రుణం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.1 7,000 కోట్లు ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని, విశాఖపట్నంలోని 13 కీలకమైన స్థలాలను తాకట్టు పెట్టేశారని, ఈ భూములకు రూ.2800 కోట్ల విలువ కట్టార ని, ఇందులో రూ.1600 కోట్లను అప్పుగా తెచ్చుకున్నారని అన్నారు.

2019-20లో 18 పథకాల కోసం రూ.24,072 కోట్లు, 2020-21లో 19 పథకాల కోసం రూ.27,043 కోట్లు, మరో 3 పథకాలకు రూ.16,899 కోట్లు ఖర్చు చూపారు. మొత్తంగా చూసుకున్నా 22 పథకాలకు రెండు సంవత్సరాల్లో ఖర్చు చేసింది రూ.68,632 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి సగటున చేసిన ఖర్చు రూ.34,316 కోట్లు మాత్రమే. 2018-19తో పోల్చుకుంటే 2019-20లో 18 పథకాల కోసం రూ.6,043 కోట్లు మాత్రమే అధనంగా ఖర్చు చేశారు.

2020-21లో 22 పథకాల కోసం అధనంగా ఖర్చు చేసింది రూ.25,942 మాత్రమే అధనంగా ఖర్చు చేశారు. సంక్షేమం కోసం ఎంతో ఖర్చు చేశామంటున్న ప్రభుత్వం ఇప్పుడేం సమాధానం చెబుతుంది ? రాష్ట్రానికి ప్రతినెలా వస్తున్న రూ.11,000 కోట్ల ఆదాయంలో రూ.1100కోట్లు వివిధ కేంద్ర పథకాల కోసం కేంద్రం రాష్ట్ర ఖజానాలో జమచేసే మొత్తం. వీటిని కచ్చితంగా కేంద్ర పథకాలకే వాడాలి. కానీ, రాష్ట్రంలో అది జరగడంలేదు. అవిపోను మిగిలేది రూ.10వేల కోట్ల ఆదాయం.

ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా చేశామంటున్న అప్పుల రీపేమెంట్ కోసం ప్రతినెలా రూ.3,500 కోట్లు, కార్పొరేషన్ల నుంచి తెచ్చిన అప్పుల కోసం రూ.1,000 కోట్లు చెల్లిస్తోంది. అంటే మొత్తం రూ.4,500 కోట్లు అప్పుల రీపేమెంట్ కి వెళ్లిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటు ఎక్కువనే ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం రెవెన్యూ లోటు రూ.35,540 కోట్లు ఉండగా ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే రూ.21,242.14 కోట్లుగా తేలింది.

రాబడి కన్నా ఖర్చులు మరీ ఎక్కువ చేస్తుండటంతో లోటు పెరిగిపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల(ఏప్రిల్)లో రూ.17,680 కోట్ల లోటు ఉండగా మే నెలాఖరుకు రూ.20,113 కోట్లకు చేరింది. ఈమేరకు రాష్ట్ర తొలి మూడు నెలల లెక్కలను కాగ్ పరిశీలించి ఖరారు చేసింది. వివిధ రూపాల్లో రాష్ట్రానికి రెవెన్యూ రాబడి కింద రూ.30,728.81 కోట్లు వచ్చాయి.

అదే సమయంలో రెవెన్యూ ఖర్చుల మొత్తం రూ.51,970 కోట్లుగా ఉంది. తొలి మూడు నెలల ద్రవ్యలోటు మొత్తం రూ.25,874.28 కోట్లుగా తేల్చారు. ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో పేర్కొన్న ప్రకారం రాష్ట్ర అప్పు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 3,55,974.30 కోట్లకు చేరింది. దీనికితోడు పీడీ ఖాతాల ద్వారా ఇప్పటికీ చెల్లించని భారం కలిపితే ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లే లెక్క కడుతున్నారు.

కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు మినహాయిస్తే మిగిలిన అప్పులన్నీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.3.87 లక్షల కోట్లకు చేరుకుంటాయని ప్రభుత్వ అంచనాలే పేర్కొంటున్నాయి. కార్పొరేషన్ల అప్పులు లక్ష కోట్ల పైనే రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇంతవరకు రూ.1,35,600 కోట్ల రుణం తీసుకున్నట్లు లెక్కలు కడుతున్నారు. రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లకు ప్రభుత్వాలు రూ.1,19,230 కోట్ల మేర గ్యారంటీలు ఇచ్చాయి.

వాటి నుంచి రూ.1,13,000 కోట్లు ప్రభుత్వాలు ఇప్పటికే రుణంగా తీసుకున్నాయి అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ వివరించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ అప్పులపై కాంగ్రెస్ పార్టీ ప్రజా క్షేత్రంలోకి వెళ్లి వివరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.