గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 2 అక్టోబరు 2021 (12:24 IST)

క్లీన్‌ ఆంద్రప్రదేశ్ కు క్లాప్ కొట్టి... జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్‌

గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ‘క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని ఆవిష్కరించారు. 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం​. క్లాప్‌కార్యక్రమంలో భాగంగా బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కొనసాగనుంది. 
 
సీఎం జ‌గ‌న్ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లోని బంద‌రు రోడ్డు, బెంజ్ సర్కిల్ ప్రాంతం అంతా బ్లాక్ అయిపోయింది. భారీగా ట్రాఫిక్ ను దారి మ‌ళ్లించారు. త‌డి పొడి చెత్త వాహ‌నాల‌ను బారులు తీర్చి, బెంజ్ సర్కిల్ వైపు ర్యాలీగా పోనిచ్చారు. దీనిని మొత్తం డ్రోన్ల‌తో చిత్రీక‌రించి, స్వ‌చ్ఛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు భారీ ప్ర‌చారం క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. దీనితో విజ‌య‌వాడ న‌గ‌రం అంతా శ‌నివారం సంద‌డిగా మారింది.