శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (19:05 IST)

మా - ఎన్నిక‌ల క‌ల‌యిక‌లు మొద‌ల‌య్యాయి - మోహ‌న్‌బాబు రంగంలోకి దిగారు

Manchu vishnu -krishna blessings
తెలుగు చ‌ల‌న‌చిత్ర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నిక‌లు ఈనెల 10న జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్‌రాజ్‌, మంచు విష్ణు పేన‌ల్స్ ప్ర‌చారం మొద‌లు పెట్టింది. శుక్ర‌వారంనాడు మంచు మోహ‌న్‌బాబు త‌న కుమారుడిని తీసుకుని సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను క‌లిసి ఆశీర్వాదం మరియు మద్దతును కోరారు. కృష్ణ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ త‌ర్వాత త‌న పేన‌ల్ స‌భ్యుల‌ను ప‌రిచ‌యం చేశారు. ఇదేవిధంగా మ‌రికొంత మంది సినీ ప్ర‌ముఖుల‌ను క‌లుసుకున్నారు. 
 
ఇదిలా వుండ‌గా, మ‌రోవైపు ప్ర‌కాష్ రాజ్‌ను శుక్ర‌వారంనాడే క‌లిసిన ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ త‌మ సంఘీబావం తెలియ‌జేసింది. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి తన ప్యానల్‌ సంపూర్ణ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే చిత్ర నిర్మాణాలలో స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పించాలని, అందుకు ప్రకాశ్ రాజ్ తరపు నుండి పూర్తి సహకారం కావాలని వారు కోరారు.
 
AP MAA team-prakash raj
ఈ సందర్భంగా ప్రకాష్ రాజు ఏపీ మా ప్రతినిధులతో మాట్లాడుతూ.. నేను విశ్వ నటుడిగా ఉన్నాను. కనుక ఏ రాష్ట్రానికో, భాషకో పరిమితం చేయవద్దు. మా ఎన్నికలకు గాను సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి కార్మికుడి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండే విధంగా భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తున్నాము. అన్ని రాష్ట్రాల్లోని కళాకారుల పరిస్థితి ఈ విధంగానే ఉంది కావున మీ ప్రాంతంలో మీరు మీ సంఘాన్ని పటిష్టం చేసుకోండి. భవిష్యత్తులో నా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందజేయలగలనని హామీ   ఇస్తున్నాను. ఎన్నికల అనంతరం విశాఖపట్నం వస్తాము. అలాగే కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వంతో కూడా మాట్లాడతాను. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కళాకారుల స్థానం మారదు. మనం కళాకారులం.. కళాకారులుగానే ఉందాం, జీవిద్దాం. మనకు తెలిసింది నటన ఒక్కటే. మన సంక్షేమం కోసం మనం కలిసి పని చేద్దాం.. అని అన్నారు. 
 
అనంతరం ఏపీ మా అధ్యక్షులు ఎం. కృష్ణ కిషోర్, కార్యదర్శి వై అప్పారావ్, వ్యవస్థాపక అధ్యక్షలు ఏ. ఎం.ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిలు సిహెచ్.రమేష్ యాదవ్, పూతి వెంకటరెడ్డి, జీ ఎస్ కళ్యాణ్..  ప్రకాశ్ రాజుగారిని శాలువ, పుష్ప గుచ్చంతో సత్కరించి మెమొంటో(జ్ఞాపిక)ను అందజేశారు.