గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 నవంబరు 2019 (19:22 IST)

విశాఖ లాంగ్ మార్చ్‌ని విజయవంతం చేయండి: పవన్ కళ్యాణ్ పిలుపు

విశాఖపట్నంలో ఈ నెల 3న తలపెట్టిన లాంగ్ మార్చ్‌లో 13 జిల్లాల నుంచీ జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

లాంగ్ మార్చ్‌కి సంఘీభావం తెలిపిన రాజకీయ పక్షాలన్నింటికీ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో లాంగ్ మార్చ్‌కి అన్ని వర్గాల మద్దతు కోరుతూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

తమ సమస్యపై అన్ని పక్షాలను కలుపుకొని నిరసన కార్యక్రమం చేపట్టాలని భవన నిర్మాణ కార్మికులు విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "మంగళగిరి పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు తెలిపారు.

భవన నిర్మాణ కార్మికులు అన్ని పార్టీలతో కలసి నిరసన చేపట్టాలని కోరడం జరిగింది. వారి కోరిక మేరకు లాంగ్ మార్చ్‌కు అన్ని పక్షాలను ఆహ్వానించాం. సంఘీభావం తెలిపిన అందరికీ కృతజ్ఞతలు.

లాంగ్ మార్చ్‌కి విశాఖలో ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకుల అందరి సహాయ సహకారాలు కోరుతున్నాం. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు నేను ముందుకు వచ్చి మీకు అండగా నిలిచాను.

ఇది 35 లక్షల మంది పైచిలుకు భవన నిర్మాణ కార్మికుల సమస్య. వారి సమస్య ట్రేడ్ యూనియన్ నాయకులుగా మీరే ఎక్కువ అర్ధం చేసుకోగలరు. లాంగ్ మార్చ్‌కి సంఘీభావం తెలిపి సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియపర్చేందుకు ఆలంబనగా నిలవాలని కోరుతున్నాం" అన్నారు.