మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (13:02 IST)

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఐదంకెల జీతం అని నమ్మి ఇస్తే.. రమ్యశ్రీని కొట్టి చంపేశారు.. ఎక్కడ?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఐదంకెల జీతం అని నమ్మి, తమ బిడ్డను అతని చేతిలో పెట్టారు. అంగరంగ వైభవంగా వివాహం చేశారు. కట్నంగా రూ.30 లక్షల నగదును ఇచ్చారు. ఇతర ఆభరణాలు, కానుకలు ఇచ్చారు. కానీ, వివాహమై ఓ యేడాది తిరగకముందే వరకట్న వేధింపులు మొదలయ్యాయి. వీటిని భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తతో పాటు అత్తమామలు రేయింబవుళ్లు వేధిస్తుండటంతో వాటిని తట్టుకోలేక ఆ వివాహిత ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, రాజానగరం మండలం దివాన్‌ చెరువుకు చెందిన మండాల రమ్యశ్రీ (23) అనే యువతికి కాకినాడకు చెందిన వెంకట్‌తో 2018 ఆగస్టు 19వ తేదీన వివాహం జరిగింది. ఆ సమయంలో వెంకట్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అని, ఐదంకెల జీతం అని చెప్పి నమ్మబలికి, లక్షలాది రూపాయల కట్నం కింద వసూలు చేశారు. 
 
పైగా, తమ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని భావించిన రమ్యశ్రీ తల్లిదండ్రులు అప్పు చేసి మరీ రూ.30 లక్షల కట్నం, నగదు సమర్పించారు. వివాహమైన కొన్నాళ్లకే రమ్యశ్రీపై అదనపు కట్నపు వేధింపులు ప్రారంభమయ్యాయి. పల్లంరాజు నగర్‌ పవన్‌ గార్డెన్స్‌ అపార్ట్‌మెంట్‌లో రమ్యశ్రీ భర్త, అత్తమామలతో కలిసి ఉంటూవచ్చింది. అక్కడ భర్తతో పాటు.. అత్తింటివారి వేధింపులు ఎక్కువైపోయాయి. వీటిని తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. 
 
ఈ క్రమంలో రమ్యశ్రీ 2019 నవంబరులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతకుముందే ఆచారం ప్రకారం పుట్టింటివారు తీసుకువెళ్లారు. ఇదే అదునుగా భావించిన వెంకట్‌ కుటుంబ సభ్యులు రమ్యశ్రీని 11 నెలల వరకు ఇంటికి తీసుకురాలేదు. అదనపు కట్నంతోనే అడుగుపెట్టాలన్న షరతు పెట్టారు. చివరకు కొందరు పెద్దల మధ్యవర్తిత్వం కారణంగా ఈ వివాదం సద్దుమణిగింది. 
 
అయితే, ఈ యేడాది అక్టోబరు నెలలో తన బిడ్డతో రమ్యశ్రీ భర్త వద్దకు వచ్చింది. ఆమె రాకను జీర్ణించుకోలేని అత్తమామలు, గుంటూరులో ఉన్న తన చిన్న కుమారుడు వద్దకు వెళ్లారు. కానీ, నవంబరులో జరిగిన మునమరాలి పుట్టినరోజు వేడుకలకు హాజరై మళ్లీ గుంటూరుకు వెళ్లిపోయారు. అత్తమామలు దూరంగా ఉన్నప్పటికీ.. వరకట్న వేధింపులు మాత్రం ఆగలేదు. 
 
ఇక ఈ వేధింపులు భరించలేనని భావించిన రమ్యశ్రీ... సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని రమ్యశ్రీ తల్లిదండ్రులకు భర్త వెంకట్, ఆ ఇంటి పైపోర్షన్‌లో ఉంటున్న చిన్నత్త సంధ్యారాణి, చినమామ విక్రమ్‌ శ్రీనివాస్‌‌లు ఫోను చేసి చెప్పారు. అలాగే, పోలీసులకూ ఫిర్యాదు చేశారు. 
 
తమ కుమార్తె మృతివార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగమేఘాలపై కాకినాడకు చేరుకుని బోరున విలపించారు. తమ కుమార్తెను కొట్టి చంపారంటూ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మరణంపై నిజానిజాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్య చేసింది భర్త, అత్త, మామలేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతి ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాకినాడ మూడో పట్టణ పోలీసులు వెల్లడించారు.