శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 12 ఆగస్టు 2021 (09:54 IST)

నేను చనిపోయాన‌ట‌... పెన్షన్ ఆపేశారు! వృద్ధ మ‌హిళ ఆవేద‌న‌

ఆమె బ‌తికుండ‌గానే రెవిన్యూ రికార్డుల్లో చంపేశారు. డెడ్ అని స‌ర్టిఫికేట్ ఇచ్చేశారు. వ‌చ్చే పెన్ష‌న్ ని అపేశారు. బాబూ నేనింకా బ‌తికే ఉన్నా అంటూ ఆ వృద్ధ మ‌హిళ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ సుందరమ్మ అనే వృద్ధురాలు ప్రతినెలా వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉంది. రెండు నెలల క్రితం అనారోగ్య సమస్యలతో తన కుమార్తె వద్ద కొన్ని రోజులు ఉండటానికి వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి వ‌చ్చి, తనకు పెన్షన్ ఇవ్వలేదని ఆ గ్రామ వాలంటైర్ ని అడుగగా, వచ్చేనెలలో రెండు నెలల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నెల కూడా తనకు పెన్షన్ ఇవ్వలేదని వాపోయింది.

తాజాగా ఈ నెలలో కూడా తనకు పెన్షన్ రాకపోవడంతో, గ్రామ వాలంటైర్ ని ప్రశ్నించగా, ఆమె సరైన సమాధానం చెప్పలేదు. నా పెన్ష‌న్ ఏద‌ని గట్టిగా అడిగితే, పై అధికారులు చెప్ప వద్దన్నారని చెబుతూ తనకు పెన్షన్ ఇవ్వలేదని వృద్ధురాలు తెలిపింది. పెన్షన్ ఇవ్వకపోగా, తాను చనిపోయానని అంటున్నారని వృద్ధురాలు వాపోయింది.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు మూడు నెలలుగా రావాల్సిన పెన్షన్ ఇప్పించాల్సిందిగా వేడుకుంటోంది ఆ మ‌హిళ‌.