సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 11 ఆగస్టు 2021 (11:55 IST)

విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ వ‌స్తుంటే... మ‌ధ్య‌లో ఏమైంది?

విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాదుకు బ‌స్సులో బ‌య‌లుదేరింది ఈ అమ్మాయి. పేరు ర‌షీదా భాను. మ‌ధ్య‌లో ఏమైందో ఏమో... హైద‌రాబాదుకు మాత్రం చేర‌లేదు.

ఈ అమ్మాయి ఆచూకీ కోసం త‌ల్లితండ్రులు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. అయితే... ఈ అమ్మాయిని నందిగామ‌లో చూసిన‌ట్లు, కొంత మంది ఈ ఫోటో చూసి చెప్పార‌ని త‌ల్లిదండ్రులు షాహర బాను, తల్లి ఫాతి మున్నిసా క‌న్నీరుమున్నీరు అవుతోంది. నా కూతురు నందిగామ పట్టణంలో సంచరిస్తున్నట్లు కొంతమంది మా అమ్మాయి ఫోటో చూసి చెప్పార‌ని, అమ్మాయి కనపడితే సమాచారం తెలపాల్సిందిగా ఫతిమున్నిసా కన్నీరుమున్నీరుగా ఏడుస్తోంది.

విజయవాడకు చెందిన సయ్యద్ రషీద భాను భ‌ర్త ఆలీ ఉద్యోగ రీత్యా హైదరాబాదులో ఉంటున్నారు. ఈనెల 7న మధ్యాహ్నం రషీద భానును అన్నయ్య షాబుద్దీన్ ఏం టి ఎస్ ఆర్ టి సి బస్సు ఎక్కించి హైదరాబాద్ పంపించాడు. ఆమె వెళ్ళేట‌పుడు నలుపు, ఆకుపచ్చ బురఖా ధరించి చేతిలో ఆకుపచ్చ హ్యాండ్ బ్యాగ్ తో ఉంది. మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడ నుండి హైదరాబాదుకు బయలుదేరిన బస్సులో ప్రయాణిస్తున్న యువతి కనబడ‌క‌పోవ‌డం విచిత్రంగా ఉంద‌ని చెపుతున్నారు

కుటుంబ సభ్యులు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ని ఫోన్ ద్వారా సంప్రదించగా, ఆ యువతి మార్గమధ్యంలో నందిగామ ఆర్ టి సి బస్టాండ్ లో దిగిందని సమాచారం అందించాడు. ఆ యువతి చివరిగా మూడున్నర గంటల ప్రాంతంలో... నేను నందిగామ ఆర్టీసీ బస్టాండ్ లో దిగి ఉన్నాను.. సెల్ చార్జింగ్ లేదు... మరల మీకు ఫోన్ చేస్తాను అని చెప్పింద‌ట‌. అదే రోజు సాయంత్రం ఏడు, ఎనిమిది గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా, సెల్ స్విచ్ ఆఫ్ అయింది. కానీ ఈ యువతి హైదరాబాద్ చేరలేదు.

నందిగామ పట్టణంలో ఎంక్వయిరీ చేయగా, నిన్న సాయంత్రం చందాపురం బైపాస్ వద్ద ఈ అమ్మాయిని చూశామని ఫ్లై ఓవర్ కింద చిరు వ్యాపారులు చెప్పారు. అలాగే ఈ రోజు ఉదయం బస్టాండ్ ముందు ఈమెని చూశామని ఆటో డ్రైవర్ ఒక‌డు కుటుంబ సభ్యుల‌కు చెప్పాడు. నందిగామ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈమె ఆచూకీ తెలిసిన వారు... 9059611251కుగాని, లేదా పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌ని త‌ల్లితండ్రులు కోరుతున్నారు.

కొసమెరుపు ఏమిటంటే, సంవత్సర కాలంగా నందిగామ బస్టాండ్‌లో సిసి కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు తెలిపారు. ర‌షీదా భాను ఆచూకీ కోసం ఆమె త‌ల్లితండ్రులు త‌ల్ల‌డిల్లుతున్నారు.