1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (18:32 IST)

వైకాపా ఎమ్మెల్యే ప్రశ్నలకు బేల ముఖం పెట్టిన సీఎం జగన్!!

ysrcp flag
వైకాపా ఎమ్మెల్యే ఒకరు సంధించిన ప్రశ్నలకు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బేలముఖం పెట్టేశారు. ఆ దళిత ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చిన్నబుచ్చుకున్నారు. పైగా, ఇద్దరు పెద్ద రెడ్లు చెప్పినట్టుగానే నాలుగున్నరేళ్లుగా నడుచుకున్నానని, ఇపుడు తన పనితీరు బాగాలేదంటూ ఎలా అని నిలదీశారు. తన పనితీరు బాగులేదని చెప్పడం కాదనీ, ఆ పెద్ద రెడ్ల పనితీరే ఏమాత్రం బాగాలేదని సీఎం జగన్ ముఖంమీదే ఆ దళిత ఎమ్మెల్యే తేల్చి చెప్పాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు.. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. 
 
సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు తాడేపల్లి ప్యాలెస్‌కు ఎంఎస్ బాబు వెళ్లారు. ఆ సమయంలో మీ పనితీరు బాగోలేదని, పైగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే మీ స్థానంలో మరో అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్టు, అందువల్ల పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే బాబుకు సీఎం జగన్ చూపించారు. దీనికి ఎమ్మెల్యే బాబు కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. 
 
గత నాలుగున్నరేళ్ళుగా ఇద్దరు పెద్ద రెడ్లు చెప్పినట్టుగానే నడుచుకున్నానని, ఇపుడు తనపై వ్యతిరేకత ఉందంటే ఎవరి బాధ్యత అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక్కసారి కూడా తనను పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ దఫా పూతలపట్టు టిక్కెట్ ఆశించవద్దని చెప్పడం ఏమాత్రం తగదన్నారు. పైగా, డబ్బులు ఇస్తే ఐప్యాక్ టీమ్ ఏ విధంగా అయినా నివేదికలు మార్చుతుందని, పార్టీలో దళితులకు టిక్కెట్లు కేటాయించే విషయంలో అన్యాయం జరుగుతుందని సీఎం జగన్ ముంగిటే తన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీఎం జగన్ ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం పెట్టారు.