బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (16:24 IST)

ఆరు నెలలకు ముందే ఓటర్లకు బహుమతుల పంపిణీ.. ఎక్కడ?

wall clock
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేయేడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. కానీ, ఏపీలో మాత్రం అధికార వైకాపా నేతలు ఇప్పటి నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమకు తోచిన రీతిలో బహుమతుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడి ఫోటోను ముద్రించిన గోడ గడియారాలను భారీగా పంపిణీ చేస్తున్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బరిలోకి దించుతున్నారు. దీంతో ఆయన ఫోటో ఉన్న గోడ గడియారాలను పంపిణీ చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు సైతం ఇదే తరహాలో గోడ గడియారాలను పంపిణీ చేయగా వాటిపై భాస్కర్‌రెడ్డి ఫొటో ఉంది. గురువారం భాస్కర్‌రెడ్డి జన్మదినం కావడం.. గడియారాలపై ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి చిత్రం ఉండటంతో ఎన్నికల తాయిలంగానే పంపిణీ చేస్తున్నారని విపక్ష నేతలు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఈ అభియోగాలకు బలం చేకూర్చేలా.. 'మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ... మీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి (ఎమ్మెల్యే అభ్యర్థి, వైకాపా, చంద్రగిరి) అని గడియారంపై ముద్రించడం గమనార్హం. ఇలా మొత్తం 1.15 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు మండలాల్లో పంపిణీకి ఆయా గ్రామాల్లోని వైకాపా శ్రేణులకు చేరవేశారు. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందితోపాటు వాలంటీర్లతో వీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని విపక్ష నేతలు తెలిపారు.