సిస్టమ్ మారింది.. ఎక్కడా అవినీతి లేదు... 71 వేల మందికి ఉద్యోగాలు
దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మందికి నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిణీ చేశారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఈ నియామక పత్రాలను ప్రధాని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేదని, దరఖాస్తు పొందేందుకు సైతం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేదని అన్నారు.
కానీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రిక్రూట్మెంట్ విధానం పూర్తిగా మారిపోయిందన్నారు. అప్లికేషన్ నుంచి ఫలితాలు వెల్లడయ్యేంత వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయన్నారు. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు కూడా అవసరం లేదని అన్నారు. కొత్త విధానంతో రిక్రూట్మెంట్ విషయంలో అవినీతి బంధుప్రీతి పూర్తిగా నిర్మూలించామన్నారు.
కాగా, గత యేడాది అక్టోబరు నెలలో రోజ్‌గార్ మేళాను ప్రధాని ప్రారంభించారు. పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు మోదీ సర్కారు 2.9 లక్షల మందికి అపాయింట్మెంట్ లెటర్‌లను పంపిణీ చేయగా, తాజాగా కార్యక్రమంతో కలిసి ఆ సంఖ్య 3.6 లక్షలకు చేరుకుందని కేంద్రం వివరించింది.