పవన్‌ను కలిసిన కొన్ని గంటల్లోనే చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై సస్పెన్షన్ వేటు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే వైకాపా నేతలు వణికిపోతున్నారు. ముఖ్యంగా, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కంటిమీద కనుకులేకుండా పోయింది. దీంతో పవన్‌ను కలిసే చోటామోటా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ను కలవకుండా కట్టడి చేస్తున్నారు. అయితే, కిందిస్థాయి వైసీపీ నేతలు జగన్ ఆదేశాలు పాటిస్తున్నారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండే వారు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో అనేక మంది వైకాపా నేతలు జనసేన, టీడీపీల్లోకి జారుకునేందుకు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎంపీలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. తాజాగా చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా జనసేన చెంతకు చేరనున్నారు.
ఆదివారం హైదరాబాద్ నగరంలో ఆయన పవన్‌ను కలిశారు. ఈ విషయం తెలుసుకున్న కొన్ని గంటల్లో జగన్ అండ్ కో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై సస్పెన్షన్ వేటు వేసింది. సీఎం జగన్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తున్నట్టు వైకాపా కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. చిత్తూరు నియోజకవర్గం సమన్వయకర్తగా విజయానందరెడ్డిని సీఎం జగన్ ఇటీవల నియమించారు. అప్పటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన జనసేన పార్టీని ఎంచుకున్నారు. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.