మాకవరంపాలెం కుర్రోడికి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీలోని అనకాపల్లి జిల్లా మాకరవరపాలెం మండల కేంద్రానికి చెందిన ఒక యువకుడు ఏకంగా మూడు ప్రభుత్వం ఉద్యోగాలను దక్కించుకున్నాడు. ప్రస్తుతం రైల్వే శాఖలో శిక్షణ పొందుతున్న ఈ కుర్రోడికి మరో రెండు అవకాశాలు తలపు తట్టాయి.
ఈ వివరాలను పరిశీలిస్తే, మాకవరపాలెంకు చెందిన రుత్తల సత్యనారాయణ, పద్మావతి కుమారుడు రుత్తల రేవంత్... తండ్రి వ్యాపారం చేస్తుండగా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. జీవితంలో పెద్దహోదాకు చేరాలన్న లక్ష్యం పెట్టుకున్న రేవంత్ చిన్నతనం నుంచే కష్టపడి చదివాడు. ప్రస్తుతం రైల్వేలో ట్రైనీ మేనేజర్ శిక్షణలో ఉన్నాడు.
అదేసమయంలో 2021లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సి.) పరీక్షలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విభాగంలో అకౌంటెంట్‌గానూ ఎంపికయ్యాడు. దీనికి సంబంధించి నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తునాడు.
అలాగే, గత మార్చి నెలలో జరిగిన పరీక్షకు హాజరయ్యాడు. ఈనెల 13 రాత్రి విడుదలైన ఫలితాల్లో 390 మార్కులకు గానూ 332 మార్కులు సాధించాడు. దీంతో కస్టమ్స్ డిపార్టుమెంట్‌లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)గా అర్హత సాధించాడు. తమ కుమారుడు రేవంత్ సాధించిన విజయాలను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.