వివేకా హత్య కేసు : సీఎం జగన్ తమ్ముడు, కడప ఎంపీ అవినాష్‌కు సీబీఐ పిలుపు
వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా, ఏపీ సీఎం, వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డికి వరుసకు తమ్ముడు అయ్యే కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నుంచి మరోమారు పిలుపువచ్చింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ స్పష్టం చేసింది. కాగా వివేకా హత్య కేసులో అవినాష్ అనుమానితుడిగా ఉన్న విషయం తెల్సిందే.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, ఈయన వద్ద సీబీఐ మూడుసార్లు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి మరోమారు పిలుపువచ్చింది. కాగా, ఈ కేసులో అరెస్టు భయంతో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో వివేకా హత్య కేసులో అవినాష్ ఏ క్షణమైనా అరెస్టు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.