గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 మే 2023 (09:13 IST)

జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు - తెలుగు రాష్ట్రాల్లో భారీ వృద్ధి

gst collections
జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. గత 2022 ఏప్రిల్ నెలతో పోల్చితే, 2023 ఏప్రిల్ నెలలో ఈ పన్నుల వసూళ్లు ఏకంగా 12 శాతం పెరిగాయి. అలాగే గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధికంగా ఈ పన్ను వసూళ్లు నమోదైనట్టు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఈ నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూలైనట్టు తెలిపింది. గత యేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 12 శాతం అంటే రూ.19495 కోట్ల మేరకు పెరిగాయి. గత యేడాది ఏప్రిల్ నెలలో రూ.1.68 కోట్లు వసూలు అయ్యాయి. 
 
కాగా, ఈ యేడాది జనవరి నెల నుంచి ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు 10 శాతానికి పైగా పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశీయ లావాదేవీల ద్వారా ఆదాయం గత యేడాది ఇదే నెలతో పోల్చితే ఈ ఏప్రిల్ నెలలో 16 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది.
 
ఇకపోతే, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత యేడాది ఏప్రిల్ నెలలో రూ.4067 కోట్లు వసూళ్లు సాధించగా, ఏపీలో ఈ సారి ఆరు శాతం పెరుగుదలతో రూ.4329 కోట్లు నమోదు చేసింది. అదేవిధంగా తెలంగాణాలో జీఎస్టీ వసూళ్లు రూ.4955 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.5622 కోట్లుగా నమోదయ్యాయి.