బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (18:40 IST)

పగటిపూట నిద్రపోతే రోగాలు కొని తెచ్చుకున్నట్టే... అరగంట నిద్ర కూడా ముప్పే

sleep
చాలా మంది పగటి పూట నిద్రపోతుంటారు. ఈ పగటి నిద్ర అన్ని రకాలుగా హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా, అరగంట నిద్ర కూడా ఆరోగ్యానికి హాని చేస్తుందని వారు చెబుతున్నారు. పగటిపూట నిద్రపోయే మెట్రో సిటీ వాసుల్లో హైబీపీ, షుగర్, గుండె సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. అందువల్ల పగటి పూట అరగంట నిద్ర కూడా ముప్పేనని వారు హెచ్చరిస్తున్నారు. అతిగా నిద్రపోతే మాత్రం రోగాలు కొన్ని తెచ్చుకున్నట్టేనని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. తాజాగా మెట్రో నగరవాసుల జీవన శైలి, నిద్ర వేళలపై పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్ తాజాగా ప్రచురించింది. 
 
బోస్టన్‌లోని బ్రిగ్హామ్, ఉమెన్స్ ఆస్పత్రి పరిశోధకులు 3,000కిపైగా వ్యక్తుల జీవనశైలిపై అధ్యయనం చేశారు. ఊబకాయం, నిద్ర, జీవక్రియల మధ్య సంబంధాన్ని పరిశోధించారు. మధ్యాహ్నం అరగంట కంటే ఎక్కువ సేపు నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో క్రమంగా డయాబెటిస్, హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదం ఉన్నదని పరిశోధనలో వెల్లడైంది. నిద్రావస్థలో ఉన్నప్పుడు జీవక్రియలు మందగించటంతో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని తేలింది. 
 
నిత్యం 25-30 నిమిషాల కంటే ఎక్కువ కునుకు తీసే అలవాటు ఉంటే... ఇబ్బందులు తప్పవని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు తేలింది. లంచ్ తర్వాత కాసేపు నిద్రపోయే అలవాటు ఇతర దీర్ఘకాలిక రోగాలను ఆహ్వానిస్తున్నదని పరిశోధకులు చెప్తున్నారు.
 
నిజానికి పగటిపూట అతిగా నిద్రపోవడానికి రాత్రి పూట నిద్రలేమి కారణమని గుర్తించారు. దీంతోపాటు అబ్రక్టివ్ స్లీప్ అప్నియా, స్లీప్ డిజార్డర్స్, ఒబేసిటీ కారణాల చేత రాత్రి పూట కంటే పగటిపూటనే ఎక్కువగా నిద్రపోతారని గుర్తించారు. దీంతో రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోయే అలవాటు తప్పుతున్నదని తేల్చారు. 
 
ఇదే అలవాటు దీర్ఘకాలంపాటు కొనసాగితే శారీరక జీవక్రియలు మందగించి అధిక బరువు, రక్తపోటు, ఇన్సులిన్ విడుదలలో మార్పులు సంభవిస్తున్నట్టు గ్రహించారు. రాత్రిపూట 7 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోయే అలవాటు ఉన్న వారి కంటే మధ్యాహ్నాం పూట అరగంటకు మించి నిద్రపోయిన వారి గుండె పనితీరులో భారీ వ్యత్యాసం ఉండగా, బరువు కూడా వేగంగా పెరిగినట్టు తేలింది.