శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 మే 2023 (09:01 IST)

ఎమ్మెల్యే వస్తున్నారనీ ఇళ్ళకు తాళాలు వేసి వెళ్లిపోయిన గ్రామస్థులు

msbabu
చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలకు ఓ విచిత్ర పరిస్థితి ఎదురైంది. వైకాపా ప్రభుత్వం "గడపగడపకు" అనే కార్యక్రమం చేపట్టింది. దీనికి ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా, తమ ప్రాంత ఎమ్మెల్యే గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న గ్రామ ప్రజలు తమ ఇళ్ళకు తాళాలు వేసుకుని గ్రామం విడిచి వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో జరిగిన ఈ ఘటన రాజకీయంగా చర్చకు దారితీసింది. 
 
ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబుకు సోమవారం గ్రామస్తుల నుంచి పరాభవం ఎదురైంది. పూతలపట్టు మండలంలోని గ్రామాల్లో గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మగారిపల్లె గ్రామంలో రెండు ఇళ్లకు తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. అప్పటికే గ్రామ పెద్ద నరసింహనాయుడు ఎమ్మెల్యే వద్దకు వచ్చి, గెలిచి నాలుగేళ్లు అయినా రాలేదు, ఇప్పుడెందుకు వచ్చారని నిలదీశారు. 
 
దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదిలావుంటే ఎమ్మెల్యే వచ్చిన విషయం తెలుసుకుని గ్రామ ప్రజలు కనీసం ఆయనకు ముఖం కూడా చూపించకుండా ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయారు. అభివృద్ధి చేయకుండా మా ఊరికి ఎందుకు వచ్చారని బందార్లపల్లెలోనూ గ్రామస్థులు ప్రశ్నించడంతో, ఆయన రెండు నిమిషాల్లోనే అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదే పరిస్థితి మరికొన్ని గ్రామాల్లోనూ ఎమ్మెల్యేకు ఎదురైంది.