ఈ సారి ఓట్లు వేస్తే ఖచ్చితంగా రోడ్లు వేయిస్తాం : మేకపాటి గౌతం రెడ్డి
ఈ సారి ఓట్లు వేసి తనను గెలిపిస్తే ఖచ్చితంగా గ్రామానికి రోడ్లు వేయిస్తామని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. అయితే గ్రామస్థులు మాత్రం.. మాకు సిమెంట్ రోడ్డు వేయకపోయినా ఫర్వాలేదు.. కనీసం కంకర వేస్తే సరిపోతుందని అన్నారు.
కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు "గడప గడపకు మన ప్రభుత్వం" అనే కార్యక్రమాన్ని వైకాపా శ్రేణులు చేపట్టారు. అయితే వైకాపా నేతలకు ప్రజల నుంచి నిరసన సెగలు తప్పడం లేదు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచనూరులో ఆత్మకూరు వైకాపా ఇన్‌ఛార్జి మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానికులు సమస్యలు ఏకరువు పెట్టారు.
మేకపాటి కుటుంబం 30 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నా గ్రామానికి ఒక్కటంటే ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేయలేకపోయారని ఓ గ్రామస్థుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వర్షం వస్తే బురదలో నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సారి ఓట్లు వేస్తే.. ఖచ్చితంగా రోడ్లు వేయిస్తామని విక్రమ్ రెడ్డి చెప్పగా.. రోడ్డు అవసరం లేదు.. కనీసం కంకర వేసినా సరిపోతుందని సమాధానం చెప్పడంతో అంతా ఖంగుతిన్నారు.
మరోవైపు పలువురు మహిళలు తమ ఇంటికి రావొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సమస్యలున్నా కనీసం పట్టించుకోవట్లేదని.. ఓట్లకు మాత్రం పరిగెత్తుకు వస్తున్నారని మండిపడ్డారు. అలాంటి సర్పంచ్ తమకు వద్దని.. ఈ సారి ఒక్క ఓటు వేయమని ముఖంపైనే తెగేసి చెప్పారు.