భోజనం లేదంటే హోటల్‌పై దాడి చేస్తారా : వైకాపాపై చంద్రబాబు ఫైర్
భోజనం అయిపోయిందని చెబితే హోటల్‌పై దాడి చేస్తారా అంటూ వైకాపా ప్రభుత్వం పాలనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రశాంతమైన కుప్పంలో దాడుల సంస్కృతిని తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో వైకాపా కౌన్సిలర్లు దాడికి తెగబడ్డారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కుప్పంలో హోటల్‌పై వైకాపా కౌన్సిలర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైసిపి తీసుకురావడం దురదృష్టకరం. భోజనం అయిపోయిందన్న పాపానికి స్థానిక హోటల్‌పై వైసీపీ ప్రజా ప్రతినిధులు దాడి చెయ్యడం దారుణం.
ఫర్నిచర్ ధ్వంసం చేసి, మహిళలను బెదిరించడంపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి. హోటల్ నిర్వాహకులను చంపేస్తాం... హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుంది. అంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
మరోవైపు, కుప్పం పట్టణంలో బైపాస్ రహదారికి సమీపంలో ఉన్న ఓ డాబాపై వైకాపా కౌన్సిలర్లు వీరంగం సృష్టించిన సీసీ ఫుటేజీ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరలైంది. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్, మరో కౌన్సిలర్ కుమారుడు, వారి అనుచరులు దాబాపై దాడి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.