అలా జరిగితే 2024 ఎన్నికల్లో పోటీ చేయను: కొడాలి నాని
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం తొలిరోజు కొందరు మంత్రులు ఎమ్మెల్యేలకు నిరసన తప్పడం లేదు. ఇంటింటికి వెళ్ళిన కొందరు అధికార పార్టీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది.
వివిధ అంశాలపై ప్రజలు నేతల్ని నిలదీస్తున్నారు. గడప గడపకీ ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మీర్జాపురంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు నిలదీశారు.
అయితే మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై స్పందించిన కొడాలి నాని.. జగన్ బతికున్నంత కాలం ఆయన సీఎంగానే ఉండాలని, ఆయన కోసం పేదలందరూ ఒకే వేదిక మీదకు రావాలని సూచించారు.
ఒకవేళ జగన్ సీఎం కాకపోయి ఉంటే? పేదలు ఇళ్లు లేక అల్లాడిపోతుండే వారన్నారు. డిసెంబర్ 21న జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని.. గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు తనను అడిగినా.. వచ్చే ఎన్నికలు.. అంటే.. 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు. కేవలం పనీపాట లేకే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని నాని ఎద్దేవా చేశారు.