రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి లండన్, యూరప్ వంటి దేశాల పర్యటన కోసం వెళుతున్నారు. ఈ పర్యటనలోభాగంగా, ఆయన ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో కూడా పర్యటించనున్నారు. ఈ టూర్‌ను ముగించుకుని ఈ నెల 31వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం ఆయన దాదాపు రెండు నెలల పాటు బిజీగా గడిపారు. ఈ క్రమంలో ఆయన విశ్రాంతి తీసుకునేందుకు తన భార్య భారతితో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు. ఇందుకోసం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆయన విజయవాడ నుంచి లండన్‌కు బయలుదేరి వెళతారు. జగన్ కుమార్తెలు లండన్‍లో ఉంటున్న విషయం తెల్సిందే. తొలుత లండన్‌కు చేరుకుని అక్కడ తన కుమార్తెలను వెంటబెట్టుకుని ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు.
కాగా, జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసుకోగా దాన్ని విచారించిన కోర్టు ఈ నెల 17 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ పర్యటనలో ఆయన వాడే మొబైల్ నంబర్, ఈమెయిల్ తదితర వివరాలను సమర్పించాలని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులకు జగన్ సమ్మతించడంతో విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.