జగన్మోహన్ రెడ్డికి అరుదైన గౌరవం.. శిలాఫలకంపై ఆ ముగ్గురు పేర్లు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణలో జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో శిలాఫలకంపై తన పేరును లిఖించుకోనున్నారు.
ఈ నెల 21న తెలంగాణ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా అమరావతికి వచ్చి జగన్‌ను ఆహ్వానించారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా ఆహ్వానించారు. వీరిద్దరి రాకకు గుర్తుగా వారికి గౌరవం ఇస్తూ ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలా ఫలకంపై ఆ ఇద్దరి సీఎంల పేర్లు చెక్కించనున్నారు. శిలాఫలకం మీద ముందుగా గవర్నర్ నరసింహన్ పేరు, తరువాత కేసీఆర్, ఆ తర్వాత ఈ ఇద్దరు సీఎంల పేర్లు ఉండనున్నాయి.
గతంలో ఏపీలో కేసీఆర్‌కు కూడా ఇదే రకంగా జరిగింది. అక్టోబర్ 21, 2015న ఏపీ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు గవర్నర్ నరసింహన్, సింగపూర్ మంత్రులు, వివిధ దేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా సీఎం కేసీఆర్ ఇంటికి వచ్చి ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఇప్పుడు అదే విధంగా జగన్‌కు తెలంగాణ సర్కారు ప్రాధాన్యం ఇస్తోంది.