సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (07:45 IST)

జగన్ కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ.. 'ఇదే ఇక్కడ జరిగే చివరి సమావేశం' అని అంటారా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గం శుక్రవారం (27వ తేదీన) సమావేశంకానుంది. ఈ భేటీపై ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన, తదనంతర పరిణామాలే. 
 
మూడు రాజధానుల ప్రకటనతో ప్రశాంతంగా ఉండే అమరావతి ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకిపోతోంది. రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 27న జరగనున్న కేబినెట్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ముఖ్యంగా, సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూల్చివేతలతో ఆయన తన పాలన ప్రారంభించారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా, ప్రజావేదికను కూల్చేసిన నిర్ణయాన్ని అదే ప్రజావేదికలో సమావేశం నిర్వహించి మరీ.. 'ఇదే ఇక్కడ జరిగే చివరి సమావేశం' అని చెప్పిన సీఎం జగన్ మంత్రివర్గ భేటీ విషయంలో కూడా ఇదే పంథా ఎంచుకుంటారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. 
 
విశాఖను ఇప్పటికే ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన సీఎం జగన్ 27వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని అక్కడే నిర్వహించి.. ఈ కేబినెట్ సమావేశం నుంచే విశాఖ నుంచి పాలన మొదలుపెడుతున్నామని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
 
అయితే.. అధికార వర్గాలు మాత్రం వెలగపూడిలోనే కేబినెట్ సమావేశం జరగనుందని చెబుతున్నాయి. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే దారిలో నివాసం ఉండే వాళ్లకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కొత్త వ్యక్తులను ఇళ్లలో ఉంచొద్దని పోలీసులు నోటీసులు పంపినట్లు తెలిసింది. 
 
వెలగపూడిలో మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే విశాఖలోనే కేబినెట్ భేటీ జరిగినా జరగొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకూ మంత్రివర్గం తీసుకునే నిర్ణయంపై మాత్రమే ఉన్న ఉత్కంఠ.. ఇప్పుడు మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరగనుందోనన్న విషయంపై కూడా ఉండటం కొసమెరుపు.